మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు ప్రారంభం నుంచి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న వివేకా కుమార్తె.. సునీతా రెడ్డి.. మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీతా రెడ్డి, సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి హత్యను జగన్, ఆయన భార్య భారతి చాలా తేలిగ్గా తీసుకున్నారని.. ఈ అంశంలో జగన్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని పేర్కొన్నారు.
తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై సీబీఐకి గత ఏడాది ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం తాజాగా వెలుగుచూసింది. ఇందులో పలు కీలక అంశాలున్నాయి. వివేకా హత్య, అనంతర పరిణామాలు, ఈ హత్యపై ఎవరెలా స్పందించారు, ఎవరెవరి హస్తం ఉండొచ్చనే విషయాలపై సునీతారెడ్డి సీబీఐకి తెలిపారు. దీంతో ఇప్పుడు సునీతారెడ్డి సీబీఐకి చెప్పిన అంశాలు కీలకంగా మారేలా ఉన్నాయి. అన్నింటికీ మించి సీఎం జగన్ పేరును కూడా ఇందులో ఆమె ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
‘‘మా నాన్నను ఎవరు హత్య చేశారో పులివెందులలో చాలా మందికి తెలుసు.. హంతకులెవరో తేల్చాలని అన్న(జగన్)ను కోరా.. అనుమానితుల పేర్లు కూడా చెప్పా. వాళ్లను ఎందుకు అనుమానిస్తావ్.. నీ భర్తే హత్య చేయించాడేమోనని అన్యాయంగా మాట్లాడారు. అయితే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని సవాల్ చేశా. సీబీఐకి ఇస్తే ఏమవుతుంది.. అవినాశ్‌రెడ్డి బీజేపీలో చేరతాడు. అతడికేమీ కాదు.. 11 కేసులకు మరొకటి తోడై పన్నెండు కేసులు అవుతాయ్’ అని సీఎం జగన్ మాట్లాడారని’’ సునీత సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్ లో పేర్కొన్నారు.
తన తండ్రి హత్యను వైఎస్ జగన్ రాజకీయ సానుభూతి కోసం వాడుకున్నారని సీబీఐకి తెలిపారు సునీతారెడ్డి. సీబీఐ విచారణ కోసం తాను కోర్టుకు వెళ్తే జగన్ రాజకీయ భవిష్యత్తు నాశనమయ్యే ప్రమాదం ఉందని వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తనతో అన్నారని తెలిపారు. అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డిల డైరెక్షన్‍లో ఆధారాలను మాయం చేశారని ఆరోపించారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిలతో పాటు మరికొందరు అనుమానితులను విచారిస్తే నిజాలు బయటపడతాయని సీబీఐకి వివరించిన ఆమె.. తన తండ్రి అంటే ఎంపీ అవినాష్‌కు గిట్టదు అని పేర్కొన్నారు. హంతకులకు శిక్ష పడాలని.. గత్యంతరం లేక సీబీఐని ఆశ్రయించానంటూ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు సునీతారెడ్డి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.