కిడ్నీ రాకెట్ గ్యాంగ్ కారణంగా విశాఖపట్నానికి చెందిన ఓ యువకుడి జీవితం నాశనం అయింది. ముఠా చేసిన పనికి ఆ యువకుడు నడవలేని స్థితిలో పడిపోయాడు. ఇంటికే పరిమితం అయ్యాడు.
విశాఖపట్నంలో వెలుగు చూసిన కిడ్నీ రాకేట్ ఉదంతం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓ ముఠా యువకుడ్ని నమ్మించి కిడ్నీ తీసుకుని మోసం చేసింది. కిడ్నీ తీసుకున్న తర్వాత బాధితుడ్ని నడిరోడ్డుపై వదిలేసి వెళ్లింది. చిల్లర డబ్బులు బాధితుడి ముఖాన కొట్టి అతడి జీవితంతో క్రూరంగా ఆడుకుంది. ముఠా కారణంగా కిడ్నీ పోగొట్టుకున్న యువకుడి పరిస్థితి దారుణంగా మారింది. కిడ్నీ పోయి.. తగినంత డబ్బులు రాక బాధితుడు లబోదిబోమంటున్నాడు. నడవలేని స్థితిలో ఇంటికే పరిమితం అయ్యాడు.
విశాఖలోని మధురవాడకు చెందిన వినయ్ అనే యువకుడు క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం వినయ్‌కి ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసే కామరాజుతో పరిచయం ఏర్పడింది. పరిచయం కొద్ది రోజులకే మంచి స్నేహంగా మారింది. కామరాజుతో ఉన్న స్నేహం కొద్ది వినయ్ తన కష్టాలను తరచుగా అతడికి చెప్పుకునేవాడు. ఇంట్లోని ఆర్థిక ఇబ్బందులు కూడా చెప్పేవాడు. వినయ్ ఆర్థిక ఇబ్బందులను కామరాజు ఆసరాగా తీసుకున్నాడు. తన కన్నింగ్ ప్లాన్‌ను అమలు చేయాలని నిశ్చయించుకున్నాడు. కిడ్నీ అమ్మితే 8,50,000 వస్తాయని వినయ్‌తో చెప్పాడు. చెప్పటమే కాదు.. కిడ్నీ ఇవ్వటానికి సిద్ధపడేలా అతడ్ని బ్రెయిన్ వాష్ చేశాడు. కామరాజు చెప్పిన విధానంతో వినయ్ కన్విన్స్ అయ్యాడు. తన కిడ్నీ ఇవ్వటానికి ఒప్పుకున్నాడు.
వినయ్ కిడ్నీ ఇవ్వటానికి ఒప్పుకోగానే.. కామరాజు అతడ్ని కేజీహెచ్ డౌన్‌లో ఉన్న విజయ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ కిడ్నీ మార్పిడికి సంబంధించిన టెస్టులు చేయించాడు. అంతా ఒకే అని తేలింది. అయితే, వినయ్ కిడ్నీ అమ్మకానికి పెట్టిన సంగతి అతడి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు షాక్‌కు గురయ్యారు. వినయ్‌ని గట్టిగా మందలించారు. వైజాగ్‌లో ఉంటే పిచ్చి పనులు చేస్తాడని చెప్పి హైదరాబాద్‌కు పంపించారు. హైదరాబాద్‌కు వెళ్లిన తర్వాత వినయ్ కిడ్నీ విషయం మరిచిపోయి తన పనిలో తాను బిజీ అయిపోయాడు.
తన ప్లాన్ వర్కవుట్ కాకపోవటంతో కామరాజు ఆగ్రహానికి గురయ్యాడు. వినయ్‌కి తరుచుగా ఫోన్లు చేస్తూ ఇబ్బంది పెట్టసాగాడు. ‘‘ కిడ్నీ ఇస్తానని చెప్పి మోసం చేశావు. నీ తల్లిదండ్రుల్ని రోడ్డుపైకి లాగుతా. నీ ఇంట్లో సామాన్లు బయటపడేస్తా’’ అంటూ బెదిరింపులకు దిగాడు. కామరాజు నిత్యం వేధిస్తుండటంతో వినయ్ భయపడిపోయాడు. కామరాజు అన్నంత పని చేస్తాడని భావించాడు. అతడి పోరు తట్టుకోలేక వినయ్ హైదరాబాద్‌నుంచి వైజాగ్ వచ్చాడు.
వినయ్ ఊర్లో దిగగానే కామరాజు అతడ్ని తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. వినయ్‌ని రైల్వే న్యూ కాలనీ దగ్గర నుంచి పెందుర్తికి తీసుకువెళ్లాడు. పెందుర్తి దగ్గర ఉన్న తిరుమల ఆస్పత్రిలో మత్తు ఇంజక్షన్ ఇచ్చి.. కిడ్నీ తీసుకున్నాడు. ఆ తర్వాతినుంచి కామరాజు తన క్రూరత్వాన్ని బయటపెడుతూ వచ్చాడు. కిడ్నీ ఆపరేషన్ తర్వాత వినయ్‌ని అతడు పట్టించుకోలేదు. ఆఖరికి మందులు కూడా కొనివ్వలేదు. ఆసుపత్రిలో కొన్ని రోజులు ఉన్న వినయ్ క్యాబ్‌లో ఇంటికి చేరుకున్నాడు. ఓ రోజు కామరాజు వినయ్ ఇంటికి వచ్చాడు. 8 లక్షలు ఇస్తానన్న వాడు కేవలం 2.50 లక్షలు మాత్రమే ఇచ్చాడు. ఆపరేషన్ జరిగిన కొద్దిరోజులు బాగానే నడిచిన వినయ్ ఇప్పుడు నడవటానికి ఇబ్బంది పడుతున్నాడు.
కామరాజు ముఠా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న యువకులను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వినయ్‌తో పాటు మరో యువకుడిని కూడా డబ్బుల ఆశ చూపి మోసం చేశారని వినయ్ చెబుతున్నాడు. ఈ ముఠా మొదట యువకులతో పరిచయం పెంచుకుంటోంది. తర్వాత వారితో స్నేహం చేసి అన్ని విషయాలు కూపీ లాగుతోంది. వారికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తెలిస్తే.. తమ ప్లాన్‌ను అమలు చేస్తోంది. వారిని గట్టిగా నమ్మించి మోసం చేస్తోంది. లక్షల్లో డబ్బు వస్తుందని నమ్మించి.. చిల్లర డబ్బులు ముఖాన కొడుతోంది. మరి, వైజాగ్‌లో వెలుగు చూసిన ఈ కిడ్నీ రాకెట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.