నేటి కాలంలో చాలా మంది యువతలో ఆత్మవిశ్వాసం, సమస్యలపై పోరాడే ధైర్యం వంటివి కొరవడ్డాయి. తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొలేక భయపడుతున్నారు. వివిధ రకాల సమస్యల కారణంగా వచ్చే ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నారు. ఈ క్రమంలో కొందరు యువత.. తమ సమస్యలకు ఆత్మహత్యే పరిష్కారంగా భావిస్తున్నారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొవాల్సిన యువతే.. ఇలా ఆత్మహత్య చేసుకుంటూ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. తాజాగా పని ఒత్తిడి కారణంగా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో మృతుడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ కు చెందిన కాడ్రా కృష్ణమూర్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు కాడ్రా అశోక్(26) బీటెక్ పూర్తి చేసి.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. బెంగళూరులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొడుకు ఉద్యోగం చేస్తూ తమకు ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉన్నాడని అతడి తల్లిదండ్రులు సంతోషించారు. అలా బెంగళూరులో ఉద్యోగం చేస్తోన్న అశోక్.. ఇటీవలే ఇంటికి చేరుకుని వర్క్ ఫ్రమ్ హోం ద్వారా పని చేస్తున్నాడు. అయితే పని ఒత్తిడి పెరగడంతో జీవితంపై విరక్తి చెందిన అశోక్ ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలోని హెచ్చెల్సీ కాలువ వద్దకు చేరుకుని అక్కడే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
అశోక్ పురుగుల మందు తాగిన విషయానికి గమనించిన స్థానికులు అతడి తల్లిదండ్రులు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అతడిని బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఏఎస్సై పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చేతికి అందివచ్చిన కుమారుడు మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మరి.. ఇలా పని ఒత్తిడి కారణంగా యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.