తిరుపతిలో భూమిలో నుండి బావి అమాంతం పైకి వచ్చిన ఘటన.. దేశ వ్యాప్తంగా అందరిని షాక్ కి గురి చేసింది. అయితే.. ఇప్పుడు ఆ మిస్టరీ వీడింది. జియాలజీ ప్రొఫెసర్స్ ఈ విషయంలో తాజాగా క్లారిటీ ఇచ్చారు. మరి.. మిస్టరీ వెనకున్న అసలు కారణం ఏమిటో తెలుసుకుందాం.
తిరుమల- తిరుపతిలో ప్రజలు వర్షాలతో పడిన ఇక్కట్లు చూసి యావత్ రాష్ట్రమే కళ్లనీళ్లు పెట్టుకుంది. గత 30 ఏళ్ళ చరిత్రలో రాయలసీమ ఎరుగని వర్షం అది. చిత్తూరు జిల్లా అంతా.. ఆ భారీ వర్షాలకు, వరదలకు వణికిపోయింది. అయితే.., ప్రస్తుతానికి అక్కడ వరుణుడు శాంతించాడు. ఇలాంటి తరుణంలోనే తిరుపతిలో వింత ఘటన చోటు చేసుకుంది.
తిరుపతి శ్రీకృష్ణానగర్ లో మునెమ్మ అనే ఓ మహిళ బావిని శుభ్రం చేస్తుండగా.. బావిలోని సిమెంట్ ఒరలు ఒక్కసారిగా పైకి లేచాయి. మొత్తం 18 సింమెంట్ ఒరలులో 7 పైకి వచ్చేశాయి. ఈ ఘటనలో బావిలో ఉండిపోయిన ఆ ఇంటి ఇల్లాలు మునెమ్మకు స్వల్ప గాయాలు అయ్యాయి. సరిగ్గా.., అదే సమయంలో మునెమ్మ భర్త బయట నుండి ఇంటికి రావడం, బావి లోపల నుండి భార్య కేకలు విని, ఆమెని కాపాడటంతో మునెమ్మ ప్రాణాలు నిలిచాయి.
వీరికి ధైర్యం చెప్పేందుకు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకున్నారు. యూనివర్సిటీ నుంచి జియాలజిస్టులను పిలిపించి దర్యాప్తు చేపిస్తామని హామీ ఇచ్చారు. “ఇదేదో అతీత శక్తి అని భ్రమల నుంచి బయటకు రండి. ఇప్పటికి వరకు కురిసిన వర్షాలకు ఇలా జరిగి ఉంటుంది. స్థానికుల్లో భయం పోగెట్టేందుకే నేను స్వయంగా వచ్చాను” అంటూ ఎమ్మెల్యే అప్పుడే ప్రజలకి దైర్యం చెప్పారు.
ఇక ఇప్పుడు ఈ తిరుపతి మిస్టరీకి అసలు కారణం బయట పడింది. భూమిలో నుండి ఒరలు పైకి వచ్చిన ప్రదేశాన్ని శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ ప్రొఫెసర్ల బృందం పర్యవేక్షించింది. భారీ వర్షాలు కురిసినప్పుడు నదీ పరీవాహిక ప్రాంతాలలో భూమి కింది పొరల్లో నీటి ఒత్తిడి పెరిగి, ఇలా జరుగుతుందని జియాలజీ ప్రొఫెసర్ మధు తెలియజేశారు. మరి.. చూశారు కదా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.