సవాళ్లను ఎదుర్కోవడం ఇష్టంతోనే శ్రీకాకుళం జీఆర్ రాధిక ఐపీఎస్ అయ్యారు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయ వృత్తిలో సేవలు అందించిన వారే. అయితే ఆమె ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె సోదరుడు చనిపోగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోని వివిధ పర్వతాలు ఎక్కి, జూనియర్ లెక్చరర్‌గా పని చేస్తూ.. గ్రూప్ 1కు సెలక్ట్ అయ్యారు. సవాళ్లను ఎదుర్కోవడం ఇష్టంతోనే ఆమె ఐపీఎస్ అయ్యారు. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయ వృత్తిలో సేవలు అందించిన వారే. అయితే ఆమె ఇంట్లో విషాదం నెలకొంది. రాధిక సోదరుడు శ్రీకాంత్ (48) అనంతపురంలోని ఓ అద్దె ఇంట్లో మృతి చెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన మేరకు .. శ్రీ సత్య సాయి జిల్లా మడశికరకు చెందిన రాధికకు శ్రీకాంత్ అన్నయ్య అవుతారు. కుటుంబ కలహాల నేపథ్యంలో కొంత కాలంగా అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఓ అద్దె ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడని తెలుస్తోంది.
శ్రీకాంత్ మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారు. గురువారం ఉదయం శ్రీకాంత్ ఉంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అనంతపురం మూడో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని ఇంటి తలుపులు తీసి పరిశీలించారు. లోపల శ్రీకాంత్ మృతదేహం కనిపించింది. రెండు రోజుల క్రితం మృతి చెందినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఫిట్స్ వచ్చినప్పుడు సాయం చేసే వారు లేకపోకపోవడంతో చనిపోయి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయాన్ని శ్రీకాంత్ బంధువులూ నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.