సాధారణంగా కరెంటు బిల్లు అందరికి వందల్లో వస్తుంది. కాకపోతే వేసవికాలంలో ఉక్కపోత భరించలేక ఏసీలు, కూలర్లు వాడితే కాస్త ఎక్కువగా వస్తుంది. కానీ ఓ ఆటో డ్రైవర్ పూరి గుడిసెకు ఏకంగా లక్షల్లో బిల్లు వచ్చింది...
సాధారణంగా కరెంట్‌ను ముట్టుకుంటే షాక్ కొడుతుంది. కానీ ఇక్కడ మాత్రం బిల్లు చూస్తేనే షాక్ కొట్టినట్లైంది. మామూలు రోజులకంటె వేసవికాలంలో కాస్త ఎక్కువగా కరెంట్ వినియోగిస్తాం కాబట్టి ఎక్కువగా బిల్లు వస్తుంది. కానీ ప్రతి నెల వందల్లో వచ్చే కరెంటు బిల్లు.. ఆటో డ్రైవర్‌కు ఏకంగా మూడున్నర లక్షల బిల్లు రావడంతో కళ్లు బైర్లు కమ్మాయి. ఆ బిల్లును తీసుకుని స్థానికంగా ఉన్న ఎలక్ట్రిసిటీ అధికారుల దగ్గరకు వెళ్లాడు. తన గోడును వినిపించాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్ రాయవరం మండలంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అనకాపల్లి జిల్లాలోని ఎస్ రాయవరం పరిధిలోని గోకులపాడు గ్రామం కలదు. ఆ గ్రామంలోని దళిత కాలనీలో రాజుబాబు అనే ఆటో డ్రైవర్ తన కుటుంబంతో నివాసముంటున్నాడు. అతడు తన ఫ్యామిలీతో పూరి గుడిసెలో ఉంటున్నాడు. ఇంత చిన్న పూరి గుడిసెకు లక్షల్లో బిల్లు రావడం ఏంటని రాజుబాబు, కుటుంబసభ్యులు షాక్‌కు గురైనారు. దీనిపై ఆరా తీసేందుకు విద్యుత్ అధికారులను సంప్రదించారు. అధికారులు సాంకేతికి సమస్యల వల్ల అధిక మొత్తంలో బిల్లు వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత తన పూరి గుడిసెకు రూ. 155 బిల్లు వచ్చిందని తెలిపారు. సాంకేతిక సమస్యలతో ఈ విధంగా బిల్లు వచ్చిందని.. ఎస్సీ రాయితీ ఉండడంతో రూ. 155 బిల్లు కూడా చెల్లించవలసిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. దీంతో రాజుబాబు కుంటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.