సాధారణంగా షాపింగ్ మాల్స్ వారు ఆషాడంలో ఆఫర్లు ప్రకటిస్తారు. అలాంటిది ఇక్కడ పోలీసులు ప్రకటించారు. దిశ యాప్ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఏపీ పోలీసులు చేస్తున్న వినూత్న ప్రయత్నం ఇది. దీంతో అక్కడి మహిళలు షాపింగ్ మాల్స్‌కు పరుగులు తీశారు.
షాపింగ్ మాల్స్ ప్రతి సంవత్సరం ఆషాడం ఆఫర్లు ప్రకటిస్తాయి. 15%, 30%, 50% అంటూ డిస్కౌంట్ సేల్ ఆఫర్ ఇస్తారు అయితే ఈ సారి ఆషాడం సేల్ కంటె ముందుగానే పోలీసులు మహిళలకు బంపరాఫర్ ప్రకటించారు. అవునండీ! మీరు విన్నది నిజమే! అది ఎక్కడ అనుకుంటున్నారా? ఏపీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పోలీసులు ఆఫర్ ప్రకటించారు. అదేంటంటే.. దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే 15% డిస్కౌంట్ ఉంటుందని ప్రకటించారు. దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న మహిళలకు బట్టల షాపుల్లో డిస్కౌంట్ కోసం షాపింగ్ మాల్స్‌కు క్యూ కట్టారు.
ఆఫర్స్ అనగానే చాలా మంది వస్తువులు కొనడానికి వస్తుంటారు. ఆడవారు ఆషాడం సేల్ రాగానే షాపింగ్ మాల్స్‌లో సందడి చేస్తూ తెగ షాపింగ్ చేస్తారు. అలాగే ఆదివారం అమలాపురం డీఎస్పీ అంబికా ప్రసాద్ దిశ యాప్ ఆడవాళ్లకు మరింత చేరువ చేయడానికి ఓ ప్రయత్నం చేశారు. అది సక్సెస్ అయ్యింది. దీని కోసం స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో అధికారులు, సిబ్బంది ఈ డ్రైవ్ లో పాల్గొన్నారు. జిల్లాలో పోలీసులు, మహిళా పోలీసు, ఇతర ఎంప్లాయిస్ సహకారంతో కాలేజీలు, షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, అన్ని బస్టాప్స్, స్కూల్స్, కాలనీలలో దిశ యాప్ డ్రైవ్ నిర్వహించారు. అలాగే వస్త్రాలపై 15 శాతం డిస్కౌంట్ కోసం షాప్స్ యాజమాన్యం కూడా పోలీసులకు సహకరిస్తూ ముందుకు వచ్చాయి.
దీని ముఖ్య ఉద్దేశ్యం.. ఆడవారికి రక్షణ కల్పించే దృష్ట్యా ఈ యాప్ ప్రతి ఆడవారు పొంది ఉండాలని పోలీసు డిపార్ట్‌మెంట్ వారు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పోలీసులు ప్రజల సమస్యలను పరిష్కరించే క్రమంలో ట్రాఫిక్ రూల్స్ కూడా ప్రజలకు తెలియపరచడానికి ఇలా డ్రైవ్ లు నిర్వహిస్తారు. దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని దాని అవగాహన నిమిత్తం పోలీసులు ఈ వినూత్న ఆఫర్ ప్రకటించారు. ఆఫర్ కోసం వచ్చిన ఆడవారు యాప్ డౌన్ లోడ్ చేసుకుని డిస్కౌంట్లో వస్త్రాలు తీసుకెళ్లారు. దిశ యాప్ అవగాహన పొందిన మహిళలు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.