ప్రముఖ స్టార్ హీరో, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 24న ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ఏపీలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న వాహనం ‘వారాహి’కి కొండగట్టులో ప్రత్యేక పూజలు చేయించనున్నారు. కొండగట్టు నుంచే వారాహి వాహనం ప్రారంభం కానుంది. అనంతరం ధర్మపురి క్షేత్రాన్ని కూడా ఆయన దర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని జనసేన కీలక నేతలతో ఆయన సమావేశం అవ్వనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పవన్ తన వారాహి వాహనాన్ని కొండగట్టు నుంచి ప్రారంభించటానికి గల కారణాలు సైతం అందులో పేర్కొంది.
ఆ ప్రకటనలో ఈ విధంగా ఉంది.. ‘‘ 2009 ఎన్నికల ప్రచారం కోసం పవన్ కల్యాణ్ ఈ ప్రాంతానికి వచ్చినపుడు అత్యంత శక్తివంతమైన విద్యుత్ తీగలు తగిలి ఆయన ప్రమాదానికి గురయ్యారు. కొండగట్టు అంజనేయస్వామి కటాక్షంతోనే ప్రమాదం నుంచి బయటపడ్డారని పవన్ కల్యాణ్ ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందువల్ల ఆయన తలపెట్టే అతి ముఖ్యమైన కార్యక్రమాలు కొండగట్టు ఆలయం నుంచి ప్రారంభించటం శుభ సూచకంగా భావిస్తారు. రాజకీయ క్షేత్ర పర్యటనల కోసం రూపొందించిన ‘వారాహి’ వాహనాన్ని ఇక్కడినుంచి ప్రారంభించాలని నిర్ణయించదలిచారు’’ అని ఉంది.
కాగా, ఏపీలో ఎన్నికల పర్యటన కోసం పవన్ తన ప్రచార వాహనమైన ‘వారాహి’ని అద్భుతంగా డిజైన్ చేయించారు. ఇందులో స్పెషల్ లైటింగ్.. ఆధునిక సౌండ్ సిస్టమ్స్ ఉన్నాయి. ప్రత్యేక భద్రతా చర్యలతో పాటూ లేటెస్ట్ టెక్నాలజీతో దీన్ని సిద్ధం చేశారు. కరెంట్ పోయినా పర్యటనకు ఇబ్బంది లేకుండా వాహనంలో ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాట్లు చేశారు. పవన్ కల్యాణ్ ప్రసంగించే సమయంలో లైటింగ్ పరమైన ఇబ్బందులు లేకుండా వాహనం చుట్టూ లైట్లు ఏర్పాట్లు చేశారు. పవన్ ప్రసంగం వేల మందికి స్పష్టంగా వినిపించే విధంగా ఆధునిక సౌండ్ సిస్టం.. వాహనానికి నలువైపులా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మరి, కొండగట్టులో పవన్ ప్రత్యేక పూజలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.