ఇటీవల అడవుల్లో ఉండాల్సిన కృర జంతువులు పట్టణాలు, గ్రామాల్లో నివసించే జనావాసాల్లోకి వస్తున్నాయి. ఎక్కువగా చిరుత, పులులు, ఎలుగు బంట్లు, తోడేళ్లు గ్రామాల్లో ఉండే సాధు జంతువలపై దాడులు చేసి చంపి తింటున్నాయి.
దేశంలో జనాభా పెరిగిపోతుంది.. దీంతో నివాసస్థలాల కోసం అటవీ ప్రాంతాల్లోని చెట్లను నరకడం మొదలు పెట్టారు. దాంతో అడవుల్లో ఉండాల్సిన కృర జంతువులు పట్టణాలు, గ్రామాల్లో నివసించే జనావాసాల్లోకి వస్తున్నాయి. గ్రామాల్లోకి ప్రవేశించిన చిరుత, పులులు, ఎలుగు బంట్లు సాధు జంతువలపై దాడులు చేసి చంపి తింటున్నాయి. కొన్నిసార్లు మనుషులపై కూడా దాడులు చేసి చంపేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలో పెద్దపులుల సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా పులి పిల్ల తల్లి ఆగ్రహంతో ఉండవచ్చు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
నంద్యాల జిల్లా నంది కొట్కూర్ నియోజకవర్గంలో పెద్ద గుమ్మడాపురం సమీపంలో నల్లమల అడవులుల్లో పెద్దపులి కూనలు నాలుగు సంచరించడం గ్రామస్తులు గమనించి వాటిని ఓ గదిలో ఉంచి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న అటవీ అధికారులు అక్కడికి చేరుకొని పులి కూనలను సురక్షితంగా తీసుకు వెళ్లారు. అప్పటికే ఆ కూనలు తల్లి నుంచి దూరమై చాలా సమయం గడిచిపోవడంతో నీరసించిపోయినట్లు అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. పులి కూనలన్నీ ఆడవేనని.. ఒకేసారి నాలుగు పిల్లలను జన్మనివడం అనుదైన విషయం అని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. తల్లికి దూరమైన పులి కూనలను తిరిగి వాటి తల్లి దగ్గరకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా నాగార్జున సాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తల్లికి దూరమైన నాలుగు పులి పిల్లలు అటవీ అధికారులు సంరక్షణలో క్షేమంగా ఉన్నాయని అన్నారు. పులి పిల్లలు ఫారెస్ట్ ఆఫీస్ లో తిరుపతి నుంచి వచ్చిన ప్రత్యేక వెటర్నరీ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాయని అన్నారు. తల్లి పులి వయసు సుమారు ఏనిమిదేళ్లు ఉండొచ్చని.. టైగర్ నెంబర్ 108 గా దాన్ని గుర్తించినట్లు తెలిపారు. దూరమైన తన పిల్లలను చేరదీస్తుందో లేదో తెలియదని అన్నారు.
ప్రస్తుతం పిల్లలకు దూరమైన తల్లి పులి పరిస్థితి.. ప్రవర్తన అంచనా వేయలేమని.. అది మాత్రం తీవ్రమైన ఆగ్రహంతో ఉంటుందని అన్నారు. ప్రజలు సాయంత్రం వేల బయటకు వెళ్లవొద్దని.. ఒంటరి ప్రయాణాలు చేయవొద్దని హెచ్చరించారు అటవీ అధికారులు. ఒకవేళ తల్లి పులి రాకుంటే ఆ పులి పిల్లలను రెండేళ్ల వరకు సంరక్షించి అడవిలో వదిలివేస్తామన్నారు. మరోవైపు పులి సంచరిస్తుందన్న విషయం తెలిసిన తర్వాత ప్రజలకు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.