ఈ మధ్యకాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. కొత్త వారి చేతిలో మోసపోతున్నాము అంటే అది మన అజాగ్రతే అనుకోవచ్చు. కానీ కొన్నేళ్లుగా మనతో పాటు కలిసి ఉంటున్న వ్యక్తి, అందులోను మన ప్రాంతానికి వాలంటీర్ గా పనిచేస్తున్న వ్యక్తే మోసం చేస్తుందని ఊహించగలమా? అలా ఏళ్లపాటు మనతో పాటు కలసి ఉండేవారే మోసం చేస్తుంటే.. సమాజం పై నమ్మకం సన్నగిల్లుతుంది. తాజాగా ఓ వార్డు వాలంటీర్.. కూలీలకు వడ్డీ ఆశ చూపించింది. తెలిసిన వ్యక్తే కదా అని నమ్మి.. వారి కష్టార్జితం అంతా ఆమె వద్ద జమ చేశారు. అందరిని నమ్మించి ఒక్కసారిగా సూమారు రూ.3కోట్లతో ఉడాయించింది ఆ మహాతల్లి. దీంతో మోసపోయిన కూలీలు, పేదలు లబోదిబోమంటున్నారు. ఈఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా సాలూరు పట్టణలోని చిట్లు వీధికి చెందిన మానాపురం రమ్య వార్డు వాలంటీర్ గా పనిచేస్తోంది. అక్కడే స్థానికంగా ఆమె తల్లితో కలసి 15 ఏళ్లుగా పొదుపు వ్యాపారం నిర్వహిస్తోంది రమ్య. అలా ఒకటీ..రెండూ కాదు పట్టణంలోని దాదాపు అన్ని వార్డుల్లో ఇంటింటికి వెళ్లి మహిళలకు పొదుపు ఆశ చూపింది. రమ్య.. రోజూ వారి కూలీలను, పేదలను దృష్టిలో పెట్టుకుని రూ.10 నుంచి రూ.200 వరకు వసూలు చేసింది. అలా తల్లికూతుర్లు సుమారు 2 వేల మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. నెలకు రూ.10 కట్టిన వారికి రూ.4 వేలు, రూ.200 కట్టిన వారికి రూ.80 వేలు ఏడాదికి చెల్లిస్తామని నమ్మించారు.
వీరిలో కొంత మందికి గడువు దాటిన డబ్బులు ఇంక చెల్లించలేదు. అడిగితే బ్యాంకులు భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వడంలేదని దాటేస్తూ వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం పెళ్లి వెళ్తున్నామని చెప్పి రమ్య.. ఆమె తల్లి అరుణ సాలూరు నుంచి వెళ్లారు. రోజులు గడుస్తున్న తిరిగి రాలేదు. ఫోన్ చేస్తున్న లిఫ్ట్ చేయడం లేదు. వారి గురించి రమ్య బంధువులను అడిగినా వారు సరైన సమాధానం చెప్పడం లేదు. దీంతో మోస పోయామని గ్రహించిన స్థానికులు పోలీసులను ఆశ్రయించారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.