తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం రోజున ఏపీ సంచలన రాజకీయ నేత జేసీ దివాకర్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు రాష్ట్రాల రాజకీయా గురించి తనదైన స్టైల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడికి తన పాత మిత్రులను కలవడానికే వచ్చానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకే తాను వచ్చానని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అయితే కేసీఆర్ ను కలవలేకపోయారు.. మంత్రి కేటీఆర్ ను జేసీ దివాకర్ రెడ్డి కలిశారు. తర్వాత కాంగ్రెస్ శాససభ పక్ష కార్యాలయంలో పాత మిత్రులను కలిశారు.
ఈ సందర్భంగా ఆయన తెలంగాణను వదిలిపెట్టి చాలా నష్టపోయామని ఆంధ్రను వదిలేసి తెలంగాణకు వస్తానని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల విషయం గురించి తనకు స్పష్టంగా తెలియదని.. నాగార్జున సాగర్ లో జానారెడ్డి ఎందుకు ఓటమి పాలయ్యారో అందరికీ తెలుసునని చెప్పారు. జానారెడ్డి ఓడిపోతానని తాను ముందే చెప్పానని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాజకీయాలు, సమాజాలు బాగాలేవని జేసీ తెలిపారు.
ఏపీ రాజకీయాల కంటే తెలంగాణ రాజకీయాలే బాగున్నాయని, తెలంగాణను వదిలి చాలా నష్టపోయామని అన్నారు. ఏపీని వదలి తెలంగాణకు వచ్చేస్తానని జేసి చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో ఓటుకు 4 వేలు అయితది అంటూ జేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. రాయల తెలంగాణ ఏర్పడితే అందరం బాగుండే వాళ్ళం అని రాజకీయం అంశం పక్కన పడితే రాయల తెలంగాణను నేను కోరుకున్నా అని తన మనసులో మాట బయట పెట్టారు.