Cinema Hall: పెళ్లంటే ఎంత హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా పెళ్లి కూతురు కుటుంబసభ్యులకు పెళ్లి అయిపోయే వరకు ముళ్ల మీద కూర్చున్నట్లుగా ఉంటుంది. పెళ్లి కుమారుడి తరపు వారికి సౌకర్యాలన్నీ సరిగ్గా అందుతున్నాయా?.. మర్యాదల్లో ఏ లోటు లేదు కదా.. ఇలా అన్ని రకాల టెన్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏదైనా అయితే, మాట పడాల్సి వస్తుంది అని ఆలోచిస్తుంటారు. మాటతో పాటు అత్తింట్లో కూతురు అడుగు పెట్టిన తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయేమోనని భయపడాల్సి వస్తుంది. కానీ, ఓ తండ్రి మాత్రం ఈ ఇబ్బందులేమీ తలెత్తకుండా కూతురు పెళ్లి చేసేశాడు. అది కూడా పెళ్లి మండపంలో కాదు.. సినిమా హాల్లో..
సినిమా హాల్లో పెళ్లేంటి?.. అని ఆశ్చర్యపోతున్నారా?.. అయితే ఈ స్టోరీ చదివేయండి. నెల్లూరు జిల్లాకు చెందిన పలగాటి శ్రీనివాసులు రెడ్డి, సునీలల కూతురు రిషిత అమెరికాలో ఎంబీఏ చదువుతోంది. ఈ నేపథ్యంలోనే రోహిత్ అనే వ్యక్తిని ప్రేమించింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు ఒప్పుకున్నారు. అయితే, అమెరికాలోనే పెళ్లి జరగాలని పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు తేల్చిచెప్పారు. శ్రీనివాసులు రెడ్డి ఇందుకు సరేనన్నాడు. అమెరికా వెళ్లడానికి వీసాల కోసం అప్లై చేశారు. పెళ్లి తేదీ కూడా ఫిక్స్ చేశారు. పెళ్లి పనులు వేగంగా జరుగుతున్నాయి. కానీ, వీసా దొరకలేదు. దానికి తోడు పెళ్లి తేది కూడా దగ్గర పడసాగింది. దీంతో శ్రీనివాసులు రెడ్డి ఆలోచనల్లో పడ్డాడు.
అమెరికాలో కూతురు పెళ్లికి వెళ్లలేమని గుర్తించి ఓ ఆలోచన చేశాడు. ఆన్‌లైన్‌లో పెళ్లి కూతురు తరుపు వారు పెళ్లికి హజరయ్యేలా ఏర్పాట్లు చేశాడు. ఓ సినిమా హాలును బుక్ చేసి బంధువులందర్నీ అక్కడికి తీసుకెళ్లాడు. ఆన్‌లైన్‌లో కాళ్లు కడిగి కన్యాదానం చేశాడు. థియేటర్ తెరమీద అక్షింతలు చల్లి పెళ్లి వేడుకను మమా అనిపించారు. ఈ ఆన్‌లైన్ పెళ్లి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. థియేటర్లో పెళ్లి చేయటం ఏంటని జనం ఆశ్చర్యపోతున్నారు. ఏదైతేనేం ఓ తండ్రి తన బాధ్యతను ఆన్‌లైన్ ద్వారా తీర్చుకోవటం ప్రశంసనీయం. మరి, ఈ విచిత్ర పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : KA Paul: నా భార్య 68 రోజుల పాటు ఐసీయూలో ఉంది.. దేవుడితో దెబ్బలాడి తనను బతికించుకున్నాను: కేఏ పాల్