ఒక రైతు కుటుంబంలో విషాదం నెలకొంది. పొలంలో ఓ అన్నదాత సజీవ దహనమయ్యాడు. అందరి కళ్ల ముందే కాలి బూడిదయ్యాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
పంట పొలాల్లో వ్యర్థాలను తగులబెట్టడం మామూలే. చేతికొచ్చిన పంటను కోయగా.. మిగిలిన వ్యర్థాలను తగులబెడుతుంటారు అన్నదాతలు. అయితే ఇలా తగులబెట్టే క్రమంలో ఒక్కోసారి అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి ఒక ప్రమాదమే ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకుంది. తన పొలంలోని వ్యర్థాలను తగలబెట్టే క్రమంలో ఒక రైతు సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా, నాదెండ్ల మండలం, సాతులూరులో చోటుచేసుకుంది. బండారుపల్లి వెంకటేశ్వర్లు అనే 70 ఏళ్ల వృద్ధ రైతు తన పొలంలో మొక్కజొన్న పంటను సాగుచేశాడు. మొక్కజొన్నలు కోసిన తర్వాత మిగిలిన వ్యర్థాలను బుధవారం తగలబెట్టాడు. అయితే ఆ మంటలు కాస్తా పక్కనే ఉన్న తన సోదరుడి పొలంలోకి వ్యాప్తించాయి.
మంటలు ఆపేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో పరిగెడుతూ దురదృష్టవశాత్తూ కిందపడ్డాడు వెంకటేశ్వర్లు. కిందపడిన సమయంలో దగ్లర్లో ఉన్న కొంతమంది గొర్రెల కాపర్లు ఆయన్ను చూసి కాపాడేందుకు ప్రయత్నించారు. అయినా మంటల్ని ఆపడం వారికి సాధ్యపడలేదు. మంటలు చుట్టుముట్టడంతో ఆ వృద్ధ రైతు సజీవ దహనమయ్యాడు. సాయంత్రం గడిచినా వెంకటేశ్వర్లు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. ఆయన కోసం వాళ్లు గాలించారు. ఈ క్రమంలో రైతు తన పొలంలో విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి కన్నీరుమున్నీరు అయ్యారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి కంప్లయింట్ అందలేదని పోలీసులు తెలిపారు.