మాయ మాటలు చెప్పి అమ్మాయిలను వలలో వేసుకోవడం, అందిన కాడికి దోచుకోవడం ఆపై మొహం చాటేయడం.. నేటి కాలంలో కొంత మంది అబ్బాయిల కనబరుస్తున్న తీరు ఇది. కడుపులో కాయ పడ్డాక, తాము మోసపోయామని తెలిశాక.. ఏం పాలు పోని స్థితిలో అమ్మాయిలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
ప్రేమ ఓ అద్భుతం అనుకుంటారు కానీ, అదొక మాయ వల అని గ్రహించడం లేదు నేటి యువత. ప్రేమ మత్తులో పడి లక్ష్యాలను గాలికొదిలేస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు.. అబ్బాయిలు చెప్పే నాలుగు మాటలకు, అతడిచ్చే గిఫ్టులకు పడిపోతున్నారు. తన వెంటపడుతున్న అబ్బాయిలు.. ‘నువ్వే నా ప్రాణం, నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు ఒప్పుకోకపోతే నేనే చచ్చిపోతా’ అనే మాటలకు ఫిదా అయిపోయి అదే ప్రేమనుకుని, వారికి తమ అంగీకారం తెలుపుతున్నారు. పెళ్లి చేసుకుంటాన్న అపోహతో సరస్వం ఇచ్చేస్తున్నారు. తీరా అతడు మొహం చాటేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. చాలా మంది యువతులు ఈ ప్రేమకు బలౌతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని క్లాస్ రూంలోనే అబార్షన్ చేసుకుంది. అబార్షన్ వికటించడంతో ప్రాణాలు వదిలింది. పక్కనే 6 నెలల పిండం కూడా ఉంది. ఈ నెల 11న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలేజీ క్లాస్ రూంలో ఎవ్వరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడింది యువతి. ఆమె కోసం వెతికిన స్నేహితులు.. గది గడియ పెట్టి ఉండటాన్ని గమనించి.. తలుపులు కొట్టగా ఆమె తీయలేదు. దీంతో తలుపులు పగలకొట్టగా.. క్లాస్ రూంలో తీవ్ర రక్తస్రావమై యువతి కనిపించింది. ఆమె అపస్మారక స్థితిలో ఉండగా. ఆ పక్కనే పిండం పడి ఉంది. కాలేజీ సిబ్బంది సహకారంతో విద్యార్థులు వెంటనే ఆ యువతిని, పిండాన్ని పక్కనే ఉన్న ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
పరీక్షించిన వైద్యులు.. యువతి అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఈ విషయం గురించి నెల్లూరు గ్రామీణ పోలీసులకు సమాచారం అందింది. వారు ఘటనా స్థలానికి చేరుకుని.. వివరాలు సేకరించారు. ఆ యువతి.. ఓ కారు డ్రైవర్‌తో సన్నిహితంగా మెలిగినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. క్లాస్ రూమ్ లో అబార్షన్ అయ్యిందా ? లేక ఆమె యూట్యూబ్లో చూసి ఏమైనా తానే కావాలని అబార్షన్ చేసుకుందా? క్లాస్ రూంలోనే ఎందుకు ఇలా చేసింది? తల్లిదండ్రులకు ఆమె ప్రెగ్నెన్సీ విషయం తెలుసా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.