మత బోధనలు చేయాల్సిన మత గురువులు, పెద్దలు చెత్త పనులు చేస్తూ అపఖ్యాతిని మూటగట్టుకుంటున్నారు. వీరి కారణంగా మిగిలిన వారిని కూడా అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మత బోధనల పేరిట అఘాయిత్యానికి ఒడిగట్టాడో పాస్టర్.
పవిత్రమైన దేవాలయాల్లో మత పెద్దలుగా ఉంటూ అరాచకాలకు పాల్పడుతున్నారు కొందరు. వీరి వల్ల మిగిలిన వారికి కూడా చెడ్డ పేరు వస్తుంది. మతం పేరుతో తప్పుడు పనులు చేస్తున్నారు. మతంలోని మంచిని బోధించాల్సిందీ పోయి.. భక్తుల జీవితాలతో ఆటలాడుతున్నారు. ప్రార్థనల ముసుగులో పాడు పని చేసి దొరికిపోయాడో పాస్టర్. దేవుడి బోధనలను వినేందుకు చర్చికి వచ్చిన ఓ బాలికపై పాస్టర్ కన్నేశాడు. ఆ తర్వాత మెల్లిగా లోబర్చుకున్నాడు. అతడి మాటలు నమ్మిన బాలిక.. పూర్తిగా మోసపోయింది. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…
కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో పుల్లేటికుర్రు శివారు చీకురు మిల్లి వారి పేటలో పాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు బెజవాడ హోసన్న అలియాస్ సుబ్రమణ్యం. ఓ చర్చిని ఏర్పాటు చేసి మత బోధనలు చేస్తుంటారు. ఆ చర్చిలో సభ్యురాలిగా ఉంది 17 ఏళ్ల బాలిక. అయితే ఆమెకు తల్లి లేదు. చర్చికి వచ్చే సమయంలో ఈ బాలికను మాయ మాటలు చెప్పి లోబర్చుకున్నాడు పాస్టర్ హోసన్న. ఆపై గర్భవతిని చేశాడు. నెలలు నిండిన ఆమెను కొంత మంది సాయంతో ఆసుపత్రిలో చేర్పించాడు. గత నెలలో బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన వెంటనే బిడ్డను మాయం చేశాడు పాస్టర్. బాలిక బంధువులు బాలిక ఎక్కడ ఉందని పాస్టర్‌ను ప్రశ్నించగా బాలిక కడుపులో కణితి ఉందని నమ్మించాడు. చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న బాలికను ఆమె బంధువులు ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
బాలికకు తల్లి లేకపోవడంతో తండ్రిని మభ్యపెట్టి ఈ విషయంపై మాట్లాడకుండా పాస్టర్ చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. తన పాపం బయటపడకుండా బిడ్డను పాస్టరే మాయం చేశాడని బాధితురాలి బంధువులు అనుమానిస్తున్నారు. బిడ్డను అమ్మేసి ఉంటాడని లేదా చంపేసి ఉంటాడని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ బాలిక విషయం చెప్పడంతో చైల్డ్ ప్రొటక్షన్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక అంగన్‌వాడీ కార్యకర్త, మహిళా పోలీస్, చైల్డ్‌ప్రొటక్షన్ అధికారులు బాలిక ఇంటికి వెళ్లి సమాచారాన్ని తెలుసుకున్నారు. బాలికకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ , ఎస్పీలకు బాలిక బంధువులు ఫిర్యాదు చేశారు. పాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, పుట్టిన బిడ్డ ఏమయ్యాడో దర్యాప్తు చేయాలని బాలిక బంధువులు కోరుతున్నారు.