రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేశారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకూ పొంచి ఉన్న ప్రమాదం గురించి కలెక్టర్లతో వీడియో కాన్ఫిరెన్స్ లో మాట్లాడారు. గోదావరి ఉదృతి, వరద సహాయక చర్యలపై సూచనలు చేశారు. గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయని..జూలై నెలలో రూ. 10 లక్షల క్యూసెక్కులకు పైబడి వరద వచ్చిందని అన్నారు. 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని, ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోందని అన్నారు. రేపు ఉదయానికి వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని, ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కునేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని అన్నారు.
మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరదలు కొనసాగే అవకాశం ఉందని సీఎం జగన్ ప్రస్తావించారు. ఈ ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరూ కూడా మృత్యువాత పడకూడదని అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయని, కంట్రోల్ రూములు సమర్ధవంతంగా పని చేయాలని ఆదేశించారు. ఇక సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రెండువేల రూపాయలు ఇవ్వాలన్నారు. ఈ అమౌంట్ బాధితులకు తక్షణ సహాయంగా వారికి ఉపయోగపడుతుందని జగన్.. అధికారులకు తెలియజేశారు.