Muscat: పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి కష్టాలు పడుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. ముఖ్యంగా ఆడవాళ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. అరబ్ దేశాలకు వెళ్లిన వారు కష్టాలు పడటానికి ప్రధాన కారణం ఏజెంట్ల మోసం. డబ్బుల కోసం నమ్మి వచ్చిన వారి మోసం చేస్తుంటారు ఏజెంట్లు. ఏజెంట్ల మోసాలు, యజమానుల దారుణాల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య చాలానే ఉంది. తాజాగా, ఏజెంట్‌ను నమ్మి మస్కట్ వెళ్లిన ఓ మహిళ తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటోంది. తనను కాపాడమని వేడుకుంటోంది. ఇంతకీ సంగతేంటంటే.. చిత్తూరు జిల్లా, ఎర్రావారి పాలెం మండలంలోని బోడ వాండ్లపల్లెకి చెందిన 38 ఏళ్ల సులోచన ఏజెంట్ సహాయంతో మస్కట్ వెళ్లింది.
అక్కడికి వెళ్లిన తర్వాతినుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఆమె పనిచేసే చోట యజమానులు ఆమెతో దారుణంగా ప్రవర్తించటం మొదలుపెట్టారు. ఆరోగ్యం బాగోలేకపోయినా పని చేయించేవారు. ఈ నేపథ్యంలోనే భారత్‌కు తిరిగి వచ్చేద్దామని అనుకుంది. అయితే, ఏజెంట్ ఇందుకు ఒప్పుకోలేదు. ఎంత బతిమాలినా పట్టించుకోలేదు. దీంతో ఆమె ఆవేదన చెందింది. తన బాధను వీడియో రూపంలో చిత్రీకరించింది. ‘‘ నేను మస్కట్‌కు వచ్చి ఏడు నెలలు అవుతోంది. 3 నెలలనుంచి నాకు ఆరోగ్యం బాగోలేదు. నా కాలు బాగోలేదు.
నిలబడలేకుండా.. కూర్చోలేకుండా ఉన్నా.. రెండు నెలల నుంచి నా జీతం డబ్బులు నేనే ఖర్చు పెట్టుకుని ఆరోగ్యం చూపించుకుంటున్నాను. ఇంటికి పంపమని అడుగుతున్నాను. 2 లక్షలు కట్టి వెళ్లమని అంటున్నారు. ఏజెంట్‌కు మెసేజ్ పెడితే పట్టించుకోవటం లేదు. నా వల్ల కాదు. భారత్‌కు రప్పించండి. నా బిడ్డల్ని చూసుకోవాలి. 2 లక్షలు కట్టడం నా వల్ల కాదు. నేనెక్కడినుంచి తేవాలి. ఆ రెండు లక్షలే ఉంటే నేనెందుకు ఇక్కడికి వస్తాను’’ అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : రైలులో కాన్పు చేయడం సులభం కాదు! చాలా భయం వేసింది: MBBS స్టూడెంట్ స్వాతి రెడ్డి