సామాన్యులకు ఇప్పుడు ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అనే పరిస్థితి వచ్చింది. మార్కెట్ లో నిత్యం పెరుగుతున్న ధరలు చూసి మధ్యతరగతి కుటుంబీకులు మార్కెట్ వెళ్లాలంటే జంకుతున్నారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. రోజు రోజుకీ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతతో ప్రజలు ఉక్కిరి బిక్కరి అయిపోతున్నారు. ఇక ఎండలకు బయటకు రావాలంటే బయపడిపోతున్నారు. ఎండల ప్రభావం మనుషులపైనే కాదు.. పశు పక్షాదులపై కూడా చూపిస్తుంది. సాధారణంగా వేసవి కాలంలో అధిక వేడి తట్టుకోలేక కోళ్లు చనిపోతుంటాయి.. మార్కెట్ లో సరఫరా కూడా తగ్గిపోవడంతో చికెన్ రేటు అమాంతం పెరిగిపోతుంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధర కొండెక్కి కూర్చుంది.. రికార్డు స్థాయిలో రేట్లు పెరిగిపోయాయి. వివరాల్లోకి వెళితే..
మధ్య తరగతి కుటుంబాల్లో ఎక్కువగా తినే మాంసాహారాల్లో ఒకటి చికెన్. మార్కెట్ లో ఎప్పుడైతే మేక మాంసం ధర పెరిగిపోయిందో.. చాలా మంది చికెన్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుబాటు ధరలో ఉండటంతో ఎక్కువ చికెన్ తినడానికే ఇష్టపడుతున్నారు. కానీ ఇప్పుడు చికెన్ కొనాలన్నా భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. వేసవి కాలం కావడం వల్ల కోళ్లు చనిపోతున్నాయి.. దాంతో మార్కెట్ లో డిమాండ్ కి తగ్గట్టు సరఫరా లేకపోవడం.. దానికి తోడు దాణా ఖర్చు అధికవ్వడంతో కోడి ధర ప్రస్తుతం కొండెక్కి కూర్చుందని అంటున్నారు. మొన్నటి వరకు 200 నుంచి 250 వరకు పలికిన చికెన్ ధర ప్రస్తుతం మార్కెట్ లో ఏకంగా కేజీ రూ.310 కి పైగా అమ్ముతున్నారు.
గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగిపోయిన ఉష్ణోగ్రతకు ఫారాల్లో కోళ్లు వరుసగా చనిపోతున్నాయి. మార్కెట్ లో సప్లైకి తగ్గట్టు లేకపోవడంతో డిమాండ్ పెరిగిపోయింది.. దానికి తోడు దాణా ధరలు పెరిగాయి.. గత రెండు రోజుల నుంచి మృగశిర కార్తె నేపథ్యంలో చికెన్ గిరాకి విపరీతంగా పెరిగిపోయింది. ఇక వేసవి కాలం కావడంతో ఫంక్షలు, వివాహ వేడుకలకు చికెన్ వినియోగం పెరిగిపోయింది.. దీంతో రేట్ల పైకి ఎగబాకడానికి కారణంగా కనిపిస్తోంది. శనివారం రిటైల్ మార్కెట్ లో చికెన్ కిలో 310 పలుకగా.. పలు కాలనీలు, బస్తీల్లో మరింత రేటు కి విక్రయిస్తున్నట్లు సమాచారం. స్కిన్ చికెన్ రూ.260 నుంచి 280 వరకు అమ్ముతున్నారు. ఒక్క వారం రోజుల్లోనే అమాంతం 60 రూపాల వరకు పెరిగిపోయింది. లైవ్ బర్డ్ కిలో రూ.188 వరకు పలుకుతుంది. అయితే ఈ రెట్లు మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.