భూఆక్రమణ ఆరోపణలతో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై కేసు నమోదైంది. కోర్టు డైరెక్షన్‌తో కేసు నమోదు చేశారు చిత్తూరు జిల్లా తవణంపల్లి పోలీసులు. తన భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ ఓ రైతు చిత్తూరు నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును 2 నెలల క్రితం ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన కోర్టు భూ ఆక్రమణలపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు గల్లా జయదేవ్, ఆయన తండ్రి గల్లా రామచంద్రనాయుడు, తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సహా 12 మందిపై కేసులు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా తవణంపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలోని దిగువమాఘం గ్రామంలో దివంగత రాజగోపాల్ నాయుడు పేరిట ఏర్పాటు చేసిన రాజన్న ట్రస్ట్, ఎడ్యుకేషనల్ సొసైటీ కోసం భవనాలు నిర్మించారు. ఆ భవనాలకు ఆనుకుని ఉన్న తన పొలాన్ని ఆక్రమించుకున్నారని… భారీగా ప్రహరీ గోడ నిర్మించారని రైతు గోపీకృష్ణ తెలిపారు. తన భూమికోసం 2015 నుంచి ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోవడంతో రెండు నెలల కిందట కోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన చిత్తూరు నాలుగో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు సదరు ట్రస్ట్ సంబంధీకులతో పాటు ఆ గ్రామ బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. కాగా, కోర్టు ఆదేశాలతో గల్లా జయదేవ్ తదితరులపై ఐపీసీ 109, 120బీ, 430, 447, 506, ఆర్/డబ్ల్యూ 156(3) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.