నేటి కాలంలో ఆస్తి కోసం కొందరు దేనికైన తెగిస్తున్నారు. రక్తం పంచుకుని తోడబుట్టిన వాళ్లతో గొడవలు చేయడమే కాకుండా చివరికి అడ్డొచ్చిన తల్లిని, చెల్లిని కూడా అంతమొందించేందుకు వెనకాడడం లేదు. ఇలాంటి కఠినమైన రోజుల్లో చెల్లికి న్యాయం చేయాలంటూ ఓ సోదరుడు ఏకంగా తల్లితో పాటు కలిసి ఎడ్లబండిపై ఢిల్లీకి యాత్రగా బయలుదేరాడు. ఇటీవల బ్రదర్స్ డే రోజున వెలుగులోకి వచ్చిన ఈ వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
అసలు తన చెల్లి కోసం నందిగామ నుంచి ఢిల్లీకి వెళ్లటానికి బలమైన కారణం ఏంటి? మరీ ముఖ్యంగా తల్లితో పాటు ఎడ్లబండిపై హస్తినాకు వెళ్లటానికి దారి తీసిన సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ల గ్రామం. ఇదే ప్రాంతంలో నేలవెల్లి నాగదుర్గారావు అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. తనకు ఓ చెల్లి కూడా ఉండేది. కాగా తన చెల్లిని ఇదే మండలంలోని చందాపురం గ్రామానికి చెందిన కొంగర నరేంద్రనాథ్‌కిచ్చి 2018లో వివాహం చేశారు. ఇక వరకట్నంగా రూ.23 లక్షల నగదు, 320 గ్రాముల బంగారం, 3 ఎకరాల పొలం ఇచ్చి పెళ్లి ఘనంగా చేశారు.
ఇది కూడా చదవండి: Konaseema: నివురుగప్పిన నిప్పులా కోనసీమ.. ఇంటర్నెట్ సేవలు బంద్!
కొంత కాలం తన చెల్లి దాంపత్య జీవితం సాఫిగానే సాగింది. కానీ రోజులు గడిచేకొద్ది తన సోదరికి అత్తింటివాళ్లు వేధింపులతో నరకం చూపించారు. ఆమెను కొట్టడంతో పాటు తీవ్ర వేధింపులకు గురి చేసేవారు. ఇదే విషయంపై తన సోదరుడు తన చెల్లికి అత్తింటి నుంచి న్యాయం చేయాలంటూ అనేక సార్లు స్థానిక పోలీసులకు సైతం ఫిర్యాదు చేశాడు. కానీ కేసులో మాత్రం ఎలాంటి పురోగతి లేదు, న్యాయం కూడా జరగలేదు. ఇక తన సోదరిపై వేధింపులు ఎక్కవవుతుండడంతో నాగదుర్గారావు ఈ రాష్ట్రంలో న్యాయం జరిగేలా లేదంటూ ఢిల్లీకి వెళ్లి సుప్రీంకోర్టు, హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.
ఇక అనుకున్నట్లుగానే నాగదుర్గారావు ఈ నెల 23న ముప్పాళ్ల నుంచి ఎడ్లబండిపై ఢిల్లీ యాత్ర ప్రారంభించాడు. మంగళవారం నాటికి యాత్ర ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. అటుగా వెళ్తున్న మీడియా అతనిని కదిలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన చెల్లి కోసం అలుపెరుగని సాహసం చేస్తున్న ఈ యువకుడిని అందరూ మెచ్చుకోవాల్సిందే. కానీ ఇక్కడ మరో విషయం ఏంటంటే? చెల్లి కోసం ఓ అన్న చేస్తున్న సాహసాన్ని మెచ్చుకోవాలా? లేక వ్యవస్థల సరిగ్గా పని చేయడం లేదని బాధ పడలో అర్థం కాని పరిస్థితి. కానీ ఓ చెల్లి కోసం సోదరుడు చేస్తున్న పోరాటంలో న్యాయం జరగాలని మనమందరం కోరుకుందాం. చెల్లికి జరిగిన అన్యాయంపై సోదరుడు చేస్తున్న ఈ పోరాట కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.