మనకంటూ రాసి పెట్టి ఉంటే ఏదైనా మన వద్దకు తప్పక వస్తుందని పెద్దలు అంటుంటారు. అట్లానే యువత ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని రేయిబవళ్ల కష్టపడి చదువుతుంటారు. కొందరు ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తారు. మరికొందరు ఎంత ప్రయత్నించిన సర్కారి ఉద్యోగం పొందలేరు. అయితే అలాంటి వారిని తోటివారు ఓదారుస్తుంటారు. “మనకంటూ ప్రభుత్వ ఉద్యోగం రాసిపెట్టి ఉంటే ఎప్పటికైన అదే మన వద్దకు వస్తుందిలే” అని అంటారు. ఆ మాట1998 డీఎస్సీ రాసిన ఓ అభ్యర్థి విషయంలో జరిగింది. అయితే పదవి విరమణ వయస్సులో పాపం ఆ వ్యక్తి ప్రభుత్వం కొలువు వచ్చింది. మరి.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం…
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వరావు చేనేత కార్మికుల కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పటి నుంచి చదువంటే మక్కువ. బీఈడీ పూర్తి చేశాడు. టీచర్ కావాలనేది ఆయన కోరిక. 1994 డీఎస్సీలో స్వల్ప తేడాతో ఉద్యోగం కోల్పోయారు. 1998లో DSC రాసినా వివాదాలతో నిలిచిపోయింది. దీంతో ఉద్యోగం రాదని భావించిన ఆయన సైకిల్‌పై చేనేత వస్త్రాలు విక్రయించడం ప్రారంభించారు. అది కూడా కలిసి రాలేదు. తల్లిదండ్రులు వృద్ధాప్యంతో చనిపోయారు. ఇద్దరు తోబుట్టువులు ఉన్నా కేదారేశ్వరరావు మానసిక స్థితిని చూసి విడిచిపెట్టారు.
దీంతో ఆయన కడుపు నింపుకొనేందుకు పాతపట్నం పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేసుకుంటున్నారు. కాగా ఇటీవల కోర్టు చిక్కుముడులు వీడి DSC-1998 క్వాలిఫై జాబితాను అధికారులు వెల్లడించారు. అందులో కేదారేశ్వరరావు పేరు ఉంది. కానీ ఆయనకు ఎటువంటి సమాచారం లేదు. గ్రామానికి చెందిన కొందరు యువకులు ఈ విషయాన్ని ఆయనకు చేరవేశారు. తనకు ఈ విషయం తెలియదని, 23 ఏళ్లు గడిచిపోయిందంటూ కేదారేశ్వరరావు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 55ఏళ్లు. పాపం విరమణ వయస్సులో ప్రభుత్వం కొలువు వచ్చిందంటూ.. ఆయన పరిస్థితి చూసి చాలా మంది చలించిపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి..ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.