నెల్లూరు జిల్లాలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తయారు చేసిన మందు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. అంతే కాదు ఆనందయ్య మందుతో కరోనా ఖతం అవుతుందనే ప్రచారంతో యావత్ దేశం ఏపీ వైపు చూస్తోంది. ఆనందయ్య మందు కోసం వేలాది మంది ఆస్పత్రి ఐసీయూలను వదిలి నెల్లూరుకు క్యూ కడుతున్నారు. వేలాదిగా వస్తున్న ప్రజలను అదుపు చేయడం పోలీసులకు సవాల్‌గా మారింది. నెల్లూరు ఆనందయ్య కరోనా నివారణకు ఇస్తున్న మందు పేరును ‘ఔషధచక్ర’గా నిర్ణయించినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ నుంచి ఆయుర్వేద మందు పంపిణీకి అవసరమైన సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కృష్ణపట్నం పోర్టుకు చెందిన సీవీఆర్ కాంప్లెక్స్‌లో మందు తయారీకి అవసరమైన ఆకులు, దినుసులు సిద్ధం చేసుకోవడంలో ఆనందయ్య బృందం నిమగ్నమై ఉంది. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి సూచన మేరకు మొదటి ప్రాధాన్యతగా సర్వేపల్లి నియోజకవర్గంలో లక్షమందికి కరోనా రానివారు వాడే ‘పి’ రకం మందు అందచేయాలని నిర్ణయించారు. తర్వాత కరోనా రోగులకు అవసరమైన ‘పి, ఎల్, ఎఫ్’ రకాల మందు పంపిణీ చేయాలని భావిస్తున్నారు. అనంతరం ఇతర నియోజకవర్గాలకు పంపిణీ చేయాలని సంకల్పించారు. మరోవైపు ఆనందయ్య ఆయుర్వేద మందు కోసం పలు ప్రాంతాల ప్రజలు కృష్ణపట్నం గ్రామానికి వస్తూనే ఉన్నారు. ప్రాథమిక నివేదికలో దీనిని ఆయుర్వేద మందు అనలేమని చెప్పిన అధికారులు, దాన్ని తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టం మాత్రం లేదని చెప్పారు. ప్రస్తుతానికి దాన్ని నాటు మందుగా గుర్తిస్తామన్నారు. వారి తుది నివేదికలో ఏఏ అంశాలంటాయన్నది తేలాల్సి ఉంది.