తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఏపీ రోడ్లు, కరెంట్ దుస్థితి చాలా అధ్వాన్నంగా ఉన్నాయని.. ఇది స్వయంగా తన ఫ్రెండ్ అనుభవంతో చెప్పాడని అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ లో ఉన్నవారు సెలవు వస్తే ఏపీకి వెళ్లాలంటే భయపడుతున్నారని.. ఇక్కడే సేద తీరుతామని అంటున్నారని.. దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ అని చెప్పారు. డాయ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు.
ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. మంత్రి కేటీఆర్ ఒక ఉన్నత స్థానంలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు అన్నారు. ఒక స్నేహితుడు చెప్పిన విషయం విని పక్క రాష్ట్రంపై ఇంత దిగజారుడు మాటలు మాట్లాడటం ఎంత వరకు సబబు అని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. తాను హైదరాబాద్ లోఉన్నపుడు కరెంట్ లేక జనరేటర్ ఉపయోగించి పనులు చేశారని అన్నారు. కానీ నేను ఈ విషయం బహిరంగంగా ఎవరికీ చెప్పలేదు కదా.. బాధ్యత కలిగిన స్థాయిలో ఉండి అలా మాట్లాడకూడదు అన్నారు.
ఏపీ ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా స్పందించారు. తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి. అందుకే తెలంగాణలో కరెంట్ కోతలు లేవు అదేం గొప్ప విషయం కాదని అన్నారు. అలాగే ఏపీలో కూడా కరెంట్ కొరత లేకుండా ప్రజలకు మెరుగైన విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. ఇందు కోసం బొగ్గును ఎక్కువ ధరకు కొనడానికైనా సిద్ధం. తెలంగాణలో త్వరలో ఎన్నికలు రానున్నాయి. ఎవరో ఒకర్ని కించపరిస్తే ఓట్లు పడతాయని విమర్శించారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ది గురించి కేటీఆర్ మాట్లాడే ముందు అది ఎలా సాధ్యమైందన్న విషయం గురించి తెలుసుకోవాలని అన్నారు. ఆంధ్ర కు చెందిన వారే హైదరాబాద్ లో ఎక్కువ ఉన్నారు.. డబ్బులు పెట్టుబడి పెట్టినందువల్లే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. అభివృద్ది విషయలో ఏపికీ అవార్డులు వచ్చాయి.. మరి తెలంగాణకు వచ్చాయా? అని ప్రశ్నించారు. పద్ధతి కాదని కేటీఆర్ కు చురకలంటించారు.