E-Crop: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఆ బాటలో ఈ-క్రాప్ నమోదు చేరింది. ఈ-క్రాప్ నమోదుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ-క్రాప్ వల్ల కలిగే లాభాలను ప్రత్యక్షంగా పరిశీలించిన కేంద్రం ఏపీపై ప్రశంసలు కురిపించింది. జాతీయ స్థాయిలో ఈ-క్రాప్ అమలుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఇది వరకే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-క్రాప్ పథకాన్ని అన్ని రాష్ట్రాలు స్టడీ చేయాలని, కనీసం పైలట్ ప్రాజెక్టుగానైనా అమలు చేయాలని ఆదేశించింది. అంతేకాదు! ఈ-క్రాప్‌ను ప్రధాన మంత్రి కిసాన్ యోజన, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాలకు అనుసంధానం చేయాలని భావిస్తోంది. ఇక, ఏపీ ప్రభుత్వం ఈ-క్రాప్‌ను రెండు సంవత్సరాల క్రితం నుంచే అమలు చేస్తోంది. ప్రస్తుతం ఈ-క్రాప్ ద్వారా ప్రభుత్వం సరైన సమయంలో రైతులకు అండగా నిలుస్తోంది.
ఈ-క్రాప్ వివరాలు..
ఈ-క్రాప్ అంటే ఆన్‌లైన్‌లో పంటల నమోదు ప్రక్రియ. నేషనల్ ఇన్‌ఫర్మేటిక్ సెంటర్ సహకారంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్ ద్వారా ఈ – క్రాప్ నమోదు జరుగుతోంది. గ్రామ సచివాలయాల్లో పని చేసే అగ్రికల్చర్ అసిస్టెంట్‌లు, హార్టికల్చర్ అసిస్టెంట్లు పంటలు వేసే సమయంలో పొలాలను సందర్శిస్తున్నారు. పంట, రైతు వివరాలు, సర్వే నెంబర్లు ఇలా అన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఆ వివరాలను ఈ-క్రాప్ యాప్‌లో పొందుపరుస్తున్నారు. అనంతరం క్షేత్ర స్థాయి పరిశీలనలో జియో కో ఆర్డినేట్స్‌తో సహా పంట ఫొటోను అప్లోడ్ చేస్తున్నారు. తుదిగా రైతుల వేలి ముద్రలు తీసుకుని, డిజిటల్ రసీదును వారి ఫోన్ నెంబర్‌కు పంపిస్తున్నారు.
పంట నమోదు కంప్లీట్ కాగానే ఫిజికల్ రసీదును అందిస్తున్నారు. ఈ–క్రాప్ నమోదు ద్వారా ముఖ్యంగా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను అందించటంతో పాటు.. వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, పంట రుణాలు, వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ, ప్రకృతి విపత్తుల వల్ల పంటలు నష్టపోయిన రైతున్నలకు సీజన్ ముగియకుండానే పంట నష్ట పరిహారం, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాలనందిస్తున్నారు. మరి, దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ఏపీ పథకాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Nadu-Nedu: మోదీని కదిలించిన సీఎం జగన్ ఆలోచన! దేశం అంతటా “నాడు-నేడు”!