ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి రాజుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం- విపక్షాల మధ్య మాటల యూద్ధాలు చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్- మంత్రుల మధ్య విమర్శలు- ప్రతివిమర్శలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన యువశక్తి సభ నుంచి కూడా పవన్ కల్యాణ్ ప్రభుత్వం, మంత్రుల మీద విమర్శలు చేశారు. అందుకు మంత్రులు కూడా గట్టిగానే ప్రతిదాడి చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మరొకరు చేసిన రాజకీయ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్నాయి.
ఆ వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు.. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, హాస్య నటుడు అలీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో కానివ్వండి, బయట కానివ్వండి పవన్ కల్యాణ్ అనగానే అలీ అనే పేరు కూడా గుర్తొస్తుంది. సినిమాల్లో వారి కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రాజకీయాల విషయానికి వచ్చే సరికి వారి మధ్య దూరం పెరిగిందని అందరికీ తెలిసిందే. మేము మునుపటిలాగే ఉంటున్నాం అని అలీ చెప్పినప్పటికీ ఆ దూరం అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా అలీ చేసిన వ్యాఖ్యలతో అది స్పష్టమైందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
నగరిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న అలీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ నిర్దేశించినట్లు వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు కొట్టబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో నగరిలో రోజా, రాష్ట్రంలో జగన్ గెలవడం ఖాయమంటూ జోస్యం చెప్పారు. రోజాపై పవన్ కల్యాణ్ చేసిన డైమండ్ రాణి వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. డైమండ్ అనేది చాలా కాస్ట్లీ. కోహినూర్ డైమండ్ అంటారు కదా. అయినా రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అనేవి సర్వ సాధారణం. విమర్శించిన తర్వాత తిరిగి విమర్శించక పోతే మనలో ఏదో లోపం ఉందని అనుకుంటారని విమర్శలు చేస్తారు.
రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారా? అనే ప్రశ్నకు అలీ ఆసక్తికర సమాధానం చెప్పారు. సీఎం జగన్ ఆదేశిస్తే తాను ఎక్కడినుంచైనా పోటీ చేస్తానని అలీ చెప్పుకొచ్చారు. ఏ స్థానం నుంచైనా పోటీకి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. సినిమాలు వేరు, రాజకీయం వేరు, స్నేహం వేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఎవరు మేలు చేశారో ప్రజలకు తెలుసంటూ వ్యాఖ్యానించారు. పవన్ పై పోటీ చేసే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. సీఎం జగన్ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానన్నారు. అయితే ఇంకా తన పోటీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్దఎత్తున చర్చకు దారి తీశాయి. అలీ వ్యాఖ్యలపై పవన్ అభిమానులు, జనసేన నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది దానిపై కూడా ఆసక్తి నెలకొంది.