ఓ వాలంటీర్ వీఆర్వోకు గట్టి షాక్ ఇచ్చాడు. పట్టాదారు పుస్తకం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసి చివరకు ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు ఓ వీఆర్వో. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో జరిగింది.
ఈ రోజుల్లో ఏ పని కావాలన్నా లంచం అడుగుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పనులు జరగాలంటే లంచం ఇవ్వవలసిందే. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ చిన్ని పని జరగాలన్నా చేయి తడపాల్సిందే. చేయి తడపనిదే ఏపని జరుగదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు పరిచే క్రమంలో కూడా లంచం పుచ్చుకోవాల్సిందే. లంచం ఇవ్వడం నేరం. తీసుకోవడం కూడా నేరమే. ఈ రోజుల్లో అందరు చదువుకున్నవారే కానీ చేసేటప్పుడు నియమాలను పాటించరు. లంచం తీసుకునే వారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నా కూడా లంచగొండులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో ఓ వీఆర్వో లంచగొండితనం బయటపడింది. పక్కా స్కెచ్ వేసి రెడ్ హాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టించాడు ఓ వాలంటీర్. మరి ఆ వివరాలను తెలుసుకుందాం..
కనిగిరి మండలంలో పేరంగుడిపల్లికి చెందిన వీరంరెడ్డి లక్ష్మీరెడ్డికి అజీజ్ పురంలో 2.73 ఎకరాల భూమి కలదు. లక్ష్మీరెడ్డి కొడుకు భాస్కర్‌రెడ్డి గోసులవీడు వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. వారి భూమికి సంబంధించిన పాసుపుస్తకం కోసం లక్ష్మీరెడ్డి, అతని కుమారుడు భాస్కర్ రెడ్డి కూడా చాల ప్రయత్నించారు. అయితే అజీజ్‌పురం వీఆర్వో కాసు వేణుగోపాల్ రెడ్డిని కూడా కలిసి పాస్ బుక్ కోసం ఏడాదిగా తిరుగుతున్నారు. కానీ వారి సమస్య పరిష్కారం కాలేదు.
వీఆర్వో పాసుపుస్తకం ఇచ్చేందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు. బేరమాడి చివరకు రూ. 30వేలకు సెటిల్ చేశాడు. దీంతో వాలంటీర్ భాస్కర్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల సూచనల ప్రకారం కనిగిరిలోని కపిల లాడ్జి సెంటర్ దగ్గరకు రప్పించారు. అక్కడ లంచం తీసుకుంటుండగా వీఆర్వోను ఏసీబీ అధికారులు మారువేషంలో వచ్చి పట్టుకున్నారు. వీఆర్వో డబ్బుల్ని రోడ్డుపై విసిరేసి పారిపోయేందుకు ప్రయత్నించగా.. అతడ్ని పట్టుకున్నారు.
ఏసీబీ అధికారులు వీఆర్వో వేణుగోపాల్ రెడ్డిని స్థానిక ఎంఆర్ఓ కార్యాలయానికి తరలించారు. ఆయన వద్ద ఉన్న రూ.32 వేల నగదు అధికారులు గుర్తించారు. విచారించగా పాసు పుస్తకం కోసం కనిగిరికి చెందిన దంపతుల దగ్గర లంచం తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. వీఆర్వో ఇంటిని సెర్చ్ చేయగా పది పాసుపుస్తకాలు దొరికాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వేణుగోపాల్ రెడ్డి కనిగిరి మండల వీఆర్వోల సంఘానికి అధ్యక్షుడు కావడం గమనించదగ్గ విషయం. వేణుగోపాల్ రెడ్డిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. మరో పది పాసుపుస్తకాలు వేణుగోపాల్ రెడ్డి నివాసంలో ఎందుకు ఉన్నాయని అధికారులు విచారిస్తున్నారు.