వాట్సాప్.. ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ వాట్సాప్ గురించి తెలుసు. కస్టమర్ల శ్రేయస్సు కొరకు అనేక కొత్త ఫీచర్ల కోసం నిరంతరంగా పని చేస్తున్నట్లు వాట్సాప్ ఎప్పుడూ చెబుతుంటుంది. ఈమధ్యనే.. ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ డివైజ్ ల్లో వాట్సాప్ ను ఉపయోగించుకునేలా ‘మల్టీ డివైజ్’ సపోర్ట్ ఫీచర్ ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు ప్రైమరీ అకౌంట్ కాకుండా ల్యాప్‌టాప్, ట్యాబ్, డెస్క్ టాప్ లలో లాగిన్ అయ్యే సదుపాయాన్ని కల్పించింది. అయితే తాజాగా మరో కొత్త ఫీచర్ ను వాట్సాప్ తీసుకొస్తున్నట్టు సమాచారం. ఒకే వాట్సాప్ అకౌంట్ ను రెండు స్మార్ట్ ఫోన్లలో వాడే సదుపాయాన్ని తీసుకొస్తోందట.
వాబీటాఇన్ఫో తెలిపిన వివరాల ప్రకారం.. వాట్సాప్ ‘మల్టీ డివైజ్ సపోర్టు’ సేవలను విస్తరించనుంది. యూజర్లు ప్రైమరీ మొబైల్లోనే కాకుండా మరో ఫోన్/ట్యాబ్ లో వాట్సాప్ ఓపెన్ చేసే సదుపాయాన్ని త్వరలోనే తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్ సాయంతో వాట్సాప్ అకౌంట్ ను.. మరో ఫోన్ కు లింక్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్ బీటా 2.22.10.13 వెర్షన్లలో ఈ ఫీచర్ పనిచేయనుందని సమాచారం. ‘వాట్సాప్ అకౌంట్ ఉన్న ప్రైమరీ మొబైల్ నుంచి లింక్ చేయాలనుకున్న స్మార్ట్‌ఫోన్‌లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది’. అయితే, ఈ ఫీచర్ ఇంకా ప్రయోగాత్మక దశలో ఉందని.. ఫైనల్ వర్షన్ అందుబాటులోకి వచ్చే సమయానికి కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని వాబీటాఇన్ఫో వెల్లడించింది.
ఇది కూడా చదవండి: ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్.. 43 బిలియన్ డాలర్ల డీల్!
వాట్సాప్ మల్టీడివైజ్ సపోర్ట్యూ ఫీచర్ యూజర్లందరికీ గత నెలలోనే అందుబాటులోకి వచ్చింది. అకౌంట్ ఉన్న ఫోన్‌కు ఇంటర్నెట్ లేకున్నా.. అంతకు ముందే వాట్సాప్ వెబ్ ద్వారా లింక్ చేసుకున్న డివైజ్‌ల్లో వాట్సాప్ వినియోగించుకునే సదుపాయం ఈ ఫీచర్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. యూజర్లు ఒక్కసారి కంప్యూటర్/ల్యాప్‌టాప్‌లో.. వాట్సాప్ వెబ్ ద్వారా లాగిన్ అయితే మొబైల్‌కు కచ్చితంగా ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఫోన్ 14 రోజుల పాటు మొబైల్ ఇన్‌యాక్టివ్‌గా ఉంటే లింక్ డివైజ్‌ల్లో వాట్సాప్ డిస్కనెక్ట్ అవుతుంది.