రాహుల్‌ ద్రవిడ్‌ స్థానాన్ని ఆక్రమించుకున్న విరాట్‌ కోహ్లీ

Virat Kohli and Dravid

రన్‌ మెషిన్‌ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కేప్‌ టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీతో రాణించిన కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు. సౌత్‌ ఆఫ్రికా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా వాల్ రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలుకొట్టాడు.

సఫారీ గడ్డపై రాహుల్ ద్రవిడ్‌ 11 టెస్ట్‌ల్లో 624 పరుగులు చేయగా.. తాజా ఇన్నింగ్స్‌తో కోహ్లీ ద్రవిడ్‌ రికార్డును అధిగమించాడు. 14 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద కోహ్లీ.. ద్రవిడ్‌ను వెనక్కునెట్టాడు. ఈ జాబితాలో దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్‌ టెండూల్కర్‌ (15 మ్యాచ్‌ల్లో 1161 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. సౌత్‌ ఆఫ్రికాలో ఇప్పటివరకు 7 టెస్ట్‌లు ఆడిన కోహ్లీ.. 50కి పైగా సగటుతో 688 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ సేన ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 223 పరుగులకే ఆలౌట్‌ అయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(201 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 79) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. పుజారా(77 బంతుల్లో 7 ఫోర్లతో 43) పర్వాలేదనిపించాడు.

ఈ ఇద్దరూ మినహా మరే బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడా(4/73) నాలుగు, మార్క్ జాన్సేన్(3/55) మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీజులో ఎయిడెన్ మార్కరమ్‌(8), కేశవ్ మహరాజ్(6) ఉన్నారు. బుమ్రా బౌలింగ్‌లో డీన్ ఎల్గర్(3) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

ఇదీ చదవండి: ద్రవిడ్‌ కోచ్‌ అయ్యాక టీమిండియాకు కలిసొస్తోంది! 8/8..