టీమిండియా విజకేతనం.. ఓవల్‌ వేదికగా రికార్డుల మోత

team india celebrations

టీమిండియా.. ఓవల్‌ స్టేడియంలో విజయకేతనం ఎగరవేసింది. భారత్‌ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌లో 2-1తో టీమిడియా లీడ్‌లోకి వచ్చింది. ఒకానొక సమయంలో డ్రాగా, కాసేపు ఓడిపోతుందని భావించారు. కానీ, అనూహ్యంగా విజయం సాధించారు. ఉమేష్‌ యాదవ్‌, బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌, జడేజాల విజయంగానే చెప్పొచ్చు. ఓపెనర్లు ఇద్దరు హాఫ్‌ సెంచరీలు చేసి పటిష్టంగా కనిపిస్తున్న సమయంలో పార్ట్‌నర్‌షిప్‌ని బ్రేక్‌ చేసి శార్దూల్‌ ఠాకూర్‌ బ్రేక్‌త్రూ ఇచ్చాడు. లార్డ్స్‌లో పరిస్థితులే మళ్లీ రిపీట్‌ అయ్యాయి. ఫలితం మాత్రం ఓ ఆరు పరుగులు ఎక్కువగానే వచ్చింది. 157పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

రెండో ఇన్నింగ్స్‌లో సమిష్టి కృషి

రోహిత్‌ శర్మ అద్భుత సెంచరీ ఈ సిరీస్‌ మొత్తానికి హైలెట్‌గా చెప్పొచ్చు. 2013లోనే టెస్టు అరంగేట్రం చేసినా.. ఓవల్‌లో హిట్‌ మ్యాన్‌ తన తొలి ఓవర్‌సీస్‌ సెంచరీ నమోదు చేశాడు. బ్యాటింగ్‌ పరంగా పుజారా 61 పరుగులు కూడా చాలా ప్రత్యేకం. తన సహజ శైలిని పక్కన పెట్టి ఫుల్‌ అటాకింగ్‌గా బ్యాటింగ్‌ చేశాడు. కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో 44 పరుగులు మంచి లీడ్‌కు దోహదం చేశాయి. కానీ, కోహ్లీ సెంచరీ కలలు మాత్రం అలాగే ఉండిపోయాయి. శార్దూల్‌ ఠాకూర్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. తొలి ఇన్నింగ్స్‌లో శార్దూల్‌ ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ(31 బంతుల్లో) 191 పరుగులు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 60(72 బంతుల్లో) పరుగులతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్‌ పిచ్‌లలో స్ట్రైట్‌ బ్యాట్‌తో పరుగులు సాధించగలమని చెప్పడమే కాదు.. శార్దూల్‌ చేసి చూపించాడు. నాలుగో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీలు చేసి చూపించాడు.

రెండో ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసిన ఇంగ్లాండ్‌

ఓపెనర్లు రోరీ బర్న్స్‌(50), హమీద్‌(63) మినహా ఎవరూ రాణించలేకపోయారు. ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ మినహా ఎవరూ రాణించలేకపోయారు. బెయిర్‌స్టో, మోయిన్‌ అలీ డకౌట్‌ అవ్వడం ఇంగ్లాండ్‌పై భారీ ప్రభావమే పడింది అని చెప్పాలి. మలాన్‌(5), ఓలీ పోప్‌(2) వంటి టాప్‌ ఆర్డర్‌, మిడిల్‌ ఆడర్‌ అందరూ విఫలమయ్యారు.

రికార్డుల మోత

రోహిత్‌ శర్మ విదేశాల్లో తొలి సెంచరీ, ఉమేష్‌ యాదవ్‌ 150 వికెట్స్‌ క్లబ్‌లో చేరడమే కాదు.. జాస్ప్రిత్‌ బుమ్రా వంద వికెట్ల క్లబ్‌లో చేరాడు. అతి వేగంగా 100 వికెట్లు సాధించిన పేసర్‌గా బుమ్రా రికార్డులు సృష్టించాడు. ఓలీ పోప్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసి బుమ్రా తన వందో వికెట్‌ తీసుకున్నాడు. తొలి ఇండియన్‌ పేసర్‌గా రికార్డులు సృష్టించాడు. కపిల్‌ దేవ్‌ పేరిట ఉన్న(25) టెస్టుల రికార్డును బుమ్రా(24) అధిగమించాడు. మొత్తం ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ డ్రాగా, రెండో టెస్టులో భారత్‌ 151 పరుగులతో విజయం సాధించింది. మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ విజయం, నాలుగో టెస్టులో 157 పరుగులతో భారత్‌ విజయకేతనం ఎగురవేసింది. 2-1తో సిరీస్‌లో భారత్‌ లీడ్‌ సాధించింది.

ప్రధాన కోచ్‌ రవిశాస్త్రికి కరోనా రావడం, మిగిలిన కోచ్‌లకు కరోనా లక్షణాలతో ఐదో టెస్టులో టీమిండియా ప్రదర్శన ప్రశ్నార్థకంగానే ఉంది. మంగళవారం మాంచెస్ట్‌ర్‌కు పయనమవుతారు. సెప్టెంబర్‌ 10 నుంచి మాంచెస్టర్‌ వేదికగా భారత్‌ఇంగ్లాండ్‌ మధ్య ఐదో టెస్టు ప్రారంభంకానుంది.