టీమిండియా ఆటగాళ్లు తీసుకునే ఆహారం విషయంలో పుకార్లు..

BCCI

‘న్యూజిలాండ్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా 2021’లో టీ20 సిరీస్‌ ను క్లీన్‌ స్వీప్‌ చేసిన టీమిండియా అదే జోరులో టెస్టు సిరీస్‌ కు సిద్ధమై పోయింది. కాన్పూర్‌ వేదికగా తొలి టెస్టు నిర్వహించనున్నారు. టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన గురించి కాకుండా వారి ఆహారపు అలవాట్ల గురించి ఇప్పుడు ఎక్కువగా చర్చ నడుస్తోంది. ప్లేయర్లు తీసుకునే ఆహారం విషయంలో పలు నిషేధాలు విధించినట్లు పుకార్లు సృష్టించారు. వారి మెనూలో బీఫ్‌, పోర్క్‌ లేదని చెప్పుకొచ్చారు. నాన్‌ వెజ్‌ తీసుకున్నా అది కూడా హలాల్‌ చేసిందే తినాలని షరతులు విధించినట్లు వార్తలు పుట్టుకొచ్చాయి. అటు న్యూజిలాండ్‌ జట్టుకు కూడా అదే మెనూ వర్తిస్తుందని.. ఆ జట్టులోనూ అజాజ్‌ యూనస్‌ పటేల్‌ వంటి ముస్లిం ప్లేయర్‌ ఉండటంతో వారికి కూడా ఇదే మెనూ వర్తింపజేస్తున్నట్లు ప్రచారాలు జరిగాయి.

బీసీసీఐ క్లారిటీ..

ఈ విషయంపై సోషల్‌ మీడియా వేదికగా పెద్ద రచ్చ జరిగింది. ఆ విషయం బీసీసీఐ దాకా వెళ్లింది. బీసీసీఐ ట్రెజరర్‌ అరుణ్‌ ధుమాల్‌ ఈ విషయంపై స్పందించారు. అలాంటి నిషేధాలు బీసీసీఐ విధించలేదని క్లారిటీ ఇచ్చారు. టీమిండియా ఆటగాళ్లు తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. వారికి నచ్చిన ఆహారాన్ని తినచ్చని ధుమాల్‌ స్పష్టం చేశారు. ఆటగాళ్ల ఆహారపు అలవాట్లను ప్రభావితం చేసేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని వివరణ ఇచ్చారు.

మొదటి టెస్టుకు విరాట్‌ కోహ్లీ అందుబాటులో ఉండటంలేదన్న విషయం తెలిసిందే. మొదటి టెస్టుకు రహానే కెప్టెన్‌ గా వ్యవహరించనున్నాడు. టీమిండియాకు మరో భారీ షాక్‌ తగిలింది. టెస్టు సిరీస్‌ నుంచి కేఎల్‌ రాహుల్‌ ను రూల్డ్‌ అవుట్‌ చేశారు. అతని స్థానంలో జట్టులోకి సూర్యకుమార్‌ యాదవ్‌ ను తీసుకున్నారు. ఎడమ తొడ కండరాలు పట్టేయడంతో కేఎల్‌ రాహుల్‌ సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు.