టీమిండియా– పాకిస్థాన్ మధ్య పోరు అంటే క్రికెట్ లో ఏ మ్యాచ్ కి లేనంత క్రేజ్ ఉంటుంది. అయితే దౌత్యపరమైన సమస్యల కారణంగా దాయాది దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు నిలిచిపోయాయి. అయితే క్రికెటర్లుగా ఇరు దేశాల ప్లేయర్లకు కలిసి సిరీస్ ఆడాలని ఉందని పాకిస్థాన్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ తెలిపాడు. అయితే దౌత్యపరమైన అంశాలు మా చేతుల్లో ఉండవు కదా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్ తో జరగనున్న సిరీస్ గురించి నిర్వహించిన మీడియా సమావేశంలో రిజ్వాన్ టీమిండియాతో సిరీస్ పై ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం తలపడాలనే కోరుకుంటున్నారు. కానీ, దౌత్య పరమైన విషయాలు క్రికెటర్ల చేతుల్లో ఉండవు కాదా. నేను ఇటీవల జరిగిన కౌంటీ క్రికెట్ లో సక్సెస్ టీమ్ తరఫున ఆడాను. ఆ టీమ్ లో టీమిండియా టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్ మన్ ఛతేశ్వర్ పుజారా కూడా ఉన్నాడు. పుజారాతో కలిసి క్రికెట్ కు సంబంధించి చాలా విషయాలపై చర్చించాను. పుజారా నుంచి క్రికెట్ కు సంబంధించి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను.
‘పుజారా చాలా మంచి వ్యక్తి.. అతని బ్యాటింగ్ ను నేను ఎంతగానో ఆరాధిస్తాను. మాది ఆటగాల్ల కుటుంబం.. మాకు ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు. అతడి ఏకాగ్రత, పట్టుదలతో బ్యాటింగ్ చేసే తీరు నాకు ఎంతో ఇష్టం. బ్యాటింగ్ విషయంలో నేను యూనిస్ ఖాన్, ఫవాద్ ఆలమ్, పుజారాలకు ఎక్కువ రేటింగ్ ఇస్తాను’ అంటూ మహ్మద్ రిజ్వాన్ చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.