పార్థివ్‌ పటేల్‌ తండ్రి కన్నుమూత.. భావోద్వేగభరిత ట్వీట్‌ చేసిన పార్థివ్‌

parthivpatel fatherdead ipl2021

టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ ఇంట తీవ్రవిషాదం నెలకొంది. అతని తండ్రి అజయ్‌భాయ్‌ బిపిన్‌ చంద్ర పటేల్‌ ఆదివారం అస్వస్థతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న అజయ్‌భాయ్‌ అది తీవ్రం కావడంతో ఆదివారం ఉదయం మరణించారు. ఈ విషయాన్ని పార్థివ్‌ స్వయంగా తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించాడు. ‘మా నాన్న అజయ్‌భాయ్‌ బిపిన్‌చంద్ర పటేల్‌ ఇవాళ స్వర్గస్తులయ్యారని తెలియజేసేందుకు చింతిస్తున్నాను. తీవ్ర విషాదంలో మునిగిపోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించగలరు’ అని పార్థివ్‌ పటేల్‌ భావోద్వేగంగా ట్వీట్‌ చేశాడు. గత కొంతకాలంగా పార్థివ్‌ తండ్రి అస్వస్థతో బాధపడుతున్నారు. పార్థివ్‌ తండ్రికి మెదడు సంబంధిత వ్యాధి ఉంది. అజయ్‌భాయ్‌ని స్వస్థలం అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థత మరీ తీవ్రరమయ్యి తుది శ్వాస విడిచారు. మాజీ క్రికెటర్లు ఆర్పీ సింగ్‌, ప్రజ్ఞాన్‌ ఓజా పార్థివ్‌ కుటుంబానికి సంతాపం తెలియజేశారు.