టిమ్‌ పైన్‌ సంచలన నిర్ణయం.. ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీకి రాజీనామా..

team

ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అతను తన టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఆస్ట్రేలియా జట్టులో కొనసాగుతానని.. కేవలం కెప్టెన్సీకి మాత్రమే రాజీనామా చేసినట్లు స్పష్టం చేశాడు. అటు క్రికెట్‌ ఆస్ట్రేలియా కూడా టిమ్‌ పైన్‌ రాజీనామాను ఆమోదించింది. అతను జట్టు సెలక్షన్స్‌ కు అందుబాటులోనే ఉంటాడని తెలిపింది. అతను గతంలో చేసిన చాటింగ్‌ ఇప్పుడు టిమ్‌ పైన్‌ రాజీనామాకు కారణమైంది.

అప్పటి చాటింగ్‌..

టిమ్‌ పైన్‌ 2017తో అప్పటి తన మహిళా సహ ఉద్యోగితో చాటింగ్‌ చేశాడు. అందులో కొంత సెక్సువల్‌ ఇమేజెస్‌ ఉన్నట్లు పైన్‌ కూడా ఒప్పుకున్నాడు. అందుకు సంబంధించి ఇప్పుడు ప్రచారం జరుగుతున్న విషయం టిమ్‌ దృష్టికి వచ్చింది. అతను వెంటనే తన బాధ్యతగా కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ‘అప్పటి నా చర్యలు ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్థాయివి కాదు. నేను నా భార్య, నా కుటుంబం, అవతలి వ్యక్తికి కూడా ఎంతో బాధను కలిగించాను. వారందరికీ క్షమాపణలు చెబుతున్నా. నా చర్యలు ఆస్ట్రేలియా క్రికెట్‌ కు ఏమైనా నష్టం కలిగించేలా ఉంటే నన్ను క్షమించండి’ అంటూ టిమ్‌ పైన్‌ అందరికీ సంజాయిషీ చెప్పుకున్నాడు.

క్రికెట్‌ ఆస్ట్రేలియా..

‘టిమ్‌ పైన్‌ నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. అతని రాజీనామాను ఆమోదిస్తున్నాం. అతను ఎప్పటిలాగానే జట్టు సెలక్షన్స్‌కు అందుబాటులో ఉంటాడు. అప్పట్లో జరిగిన దర్యాప్తు టిమ్‌ ఎలాంటి నియమాలను ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ మేము అతని నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం’ అంటూ క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది.