టీమిండియాను వదలని కరోనా.. మరొకరికి పాజిటివ్‌

Release of ICC Test Rankings - Suman TV

ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియాకు కరోనా షాక్‌లు తప్పడం లేదు. 2-1తో సిరీస్‌లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నా.. ఆఖరి టెస్టు మాత్రం విజయమో, డ్రాగానో ముగిస్తేనే మనకు ఫలితం ఉంటుంది. ఇప్పటికే హెడ్‌ కోచ్‌, ఫీల్డింగ్‌, బ్యాటింగ్‌ కోచ్‌లు లేకుండా మాంచెస్టర్‌ చేరుకున్న టీమిండియాకు మరో షాక్‌ తగిలింది. టీమిండియాకు సంబంధించిన సపోర్ట్‌ స్టాఫ్‌ మరొకరికి కరోనా నిర్ధరణ జరిగింది. ఆ విషయం తెలియగానే గురువారం మధ్యాహ్నం నుంచి ప్రాక్టీస్‌ ఆపేశారు. టీమిండియా ఆటగాళ్లు, స్టాఫ్‌ అందరూ ఎవరి గదుల్లో వారు ఉండిపోయారు. ఇప్పటికే ఆటగాళ్లకు ఇన్‌స్టెంట్‌ టెస్టింగ్‌ కిట్లు ఇవ్వడం జరిగింది. ఎవరికి ఏ మాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షించుకోవాలని సూచించారు.

ఇప్పుడు అందరి దృష్టి ఆఖరి టెస్టుపైనే ఉంది. మనోళ్ల ప్రదర్శన ఎలా ఉంటుందో.. కోచ్‌లు లేకుండా ఏం చేస్తారు అన్న ఆందోళనలో ఉన్నారు. అయితే, రవిశాత్రి, కోచ్‌లు ఎప్పటికప్పుడు టీమ్‌ సభ్యులతో ఫోన్లలో అందుబాటులో ఉంటున్నారు. వారి వ్యూహాలను, సలహాలను ఫోన్ల ద్వారా చేరవేస్తున్నారు. ఏది ఏమైనా రేపు మైదానంలోకి దిగే వరకు ఈ మీమాంస కొనసాగుతూనే ఉంటుంది. ఎలాగైనా సిరీస్‌ను చేజిక్కించుకోవాలని టీమిండియా, సిరీస్‌ను డ్రాగా ముగించాలని ఇంగ్లాండ్‌ పట్టుదలతో ఉంది. ఈ కరోనా టీమిండియాకు పెద్ద తలనొప్పినే తీసుకొచ్చింది.