ఐర్లాండ్‌ క్రికెటర్లను పరుగులు పెట్టించిన కుక్కపిల్ల.. వీడియో వైరల్‌

dog grabs ball and runs away

క్రికెట్‌ అనగానే మైదానంలో ఆటగాళ్లు పంచే వినోదం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్కోసారి అనుకోని అతిథులుగా మైదానంలో అడుగుపెట్టే పక్షులు, జంతువులు చేసే సందడి మాములుగా ఉండదు. ఐర్లాండ్ దేశవాళీ క్రికెట్‌లో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. అకస్మాత్తుగా గ్రౌండ్‌లోకి అడుగుపెట్టిన ఓ బుజ్జి కుక్క బంతిని ఎత్తుకెళ్లి ఫీల్డర్లను మైదానమంతా పరుగులు పెట్టించింది. అసలే వర్షం వల్ల 20 ఓవర్ల మ్యాచ్‌ 12 ఓవర్లకు కుదించారు. ఈ కుక్క ఎంట్రీతో మ్యాచ్‌ మళ్లీ అంతరాయానికి గురైంది.

అసలు విషయం ఏంటంటే బ్రీడీ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన దేశవాళీ టోర్నీలో బ్రీడీ, సీఎస్‌ఎన్‌ఐ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్‌ జరుగుతోంది. ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌లో అబ్బీ లెక్కీ షాట్‌ ఆడింది.. ఫీల్డర్‌ బంతిని అందుకొని వికెట్ కీపర్‌కు విసిరింది. చాలా ఈజీగా చేయాల్సిన రనౌట్‌ను కీపర్‌ మిస్‌ చేసింది. కీపర్‌ విసిరిన బంతి దూరంగా వెళ్లింది. వెంటనే అటుగా పరుగెత్తుకొచ్చిన చిన్న కుక్క ఆ బంతిని తీసుకుని పరుగులు పెట్టింది. దాని వెనుక ఫీల్డర్లు, దాని యజమాని కూడా పరుగులు తీశారు. గ్రౌండ్‌ అంతా ఓ రౌండ్‌ వేశాక ఆ కుక్క నాన్‌ స్ట్రైకర్‌కు బంతిని ఇచ్చింది. కుక్క బంతిని నోటితో పట్టుకుంది కరోనా సమయంలో ఇది నిబంధనల ఉల్లంఘన అవుతుందని కామెంటేటర్లు చమత్కరించారు. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.