విలక్షణ నటుడు సముద్ర ఖని, అనసూయ, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ నటించిన విమానం సినిమా ఇవాళ విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
తమిళ నటుడు, దర్శకుడు అయిన సముద్రఖని, అనసూయ భరద్వాజ్, మాస్టర్ ధృవన్, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ తదితరులు నటించిన సినిమా విమానం. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా కిరణ్ కొర్రపాటి నిర్మాతగా యానాల శివప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రంగస్థలం, పుష్ప సినిమాల తర్వాత మరోసారి విభిన్న పాత్రలో నటించారు అనసూయ. వేశ్య పాత్రలో తొలిసారిగా అనసూయ నటించారు. ఇక తెలుగు, తమిళ భాషల్లో విలక్షణ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకున్న సముద్ర ఖని ఈ సినిమాలో వికలాంగుడిగా నటించారు. మరి ఈ విమానం ఎంత ఎత్తుకు ఎగిరింది. మేకర్స్ ఊహించినంత ఎత్తుకు ఎగిరిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.
వీరయ్య (సముద్ర ఖని) వికలాంగుడు అయినప్పటికీ కష్టపడి పని చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఒక బస్తీలో కొడుకుతో కలిసి జీవనం సాగిస్తూ ఉంటాడు. ఓ ఆటో స్టాండ్ దగ్గర సులభ్ కాంప్లెక్స్ ని నడుపుతుంటాడు. ఇదే వీరి కుటుంబానికి జీవనాధారం. చాలీ చాలని ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటాడు. కల నిజం చేసుకోవడం దేవుడెరుగు, దాన్ని కనడమే పాపం అనుకుని ఫీలవుతుంటారు వీరయ్య. ఇంత ఇరుకులో వీరయ్య కొడుకు రాజుకి (ధృవన్) విమానం ఎక్కాలన్న కోరిక పుడుతుంది. పెద్దయ్యాక పైలట్ అవ్వాలని కల కంటాడు. అంత వరకూ ఎందుకు గానీ ఇప్పుడే ఎక్కుదువు దా అంటూ నెల రోజుల్లో విమానం ఎక్కిస్తాడు. అసలు నెల రోజుల్లో విమానం ఎక్కించాల్సిన అవసరం వీరయ్యకి ఎందుకు వచ్చింది? కొడుకు కలను నిజం చేయడానికి తండ్రి ఏం చేశాడు? ఈ వీరయ్యకి, బస్తీలో ఉండే సుమతి (అనసూయ), కోటి (రాహుల్ రామకృష్ణ), డానియల్ (ధనరాజ్)లకు సంబంధం ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే.
కొడుకు కలను నిజం చేయాలనుకునే తండ్రి కథ. తండ్రీ కొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటాయి. కొడుకు కోరికను నిజం చేయడం కోసం ఒక తండ్రి పడే కష్టాన్ని, తపనను దర్శకుడు తెరపై అద్భుతంగా చూపించారు. ఈ సినిమాలో భావోద్వేగభరిత సన్నివేశాలు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. అయితే కథ మొత్తం వీరయ్య, అతని కొడుకు చుట్టూ తిరగడం వల్ల కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది. సినిమాలో అనసూయ, ధనరాజ్, రాహుల్ రామకృష్ణ పాత్రలు తేలిపోయినట్టు అనిపిస్తుంది. వీరయ్య కొడుకు రాజు స్కూల్లో విమానం గురించి మాట్లాడే మాటలు నవ్వు తెప్పిస్తాయి. కోటి, సుమతిల పాత్రలు మంచి కాలక్షేపాన్నిస్తాయి. రాజు కలను నెరవేర్చాలనుకోవడం, వీరయ్య సులభ్ కాంప్లెక్స్ ని కూల్చివేయడంతో వీరయ్యకి కష్టాలు మొదలవుతాయి. ఈ కష్టాలు సహజంగా కనిపించకపోవడం, ఎగ్జిబిషన్ లో సన్నివేశాలను సాదాసీదాగా తెరకెక్కించడం మైనస్ అని చెప్పుకోవచ్చు. కోటి, సుమతి పాత్రల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, విమానాశ్రయంలో వీరయ్య, రాజు పాత్రల మధ్య వచ్చే పతాక సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయి.
వికలాంగుడిగా వీరయ్య చాలా అద్భుతంగా నటించారు. కొడుకు కోరికను నెరవేర్చే క్రమంలో ఎదురయ్యే సంఘర్షణను ఆయన అద్భుతంగా పండించారు. ప్రతి ఒక్క తండ్రి ఆయన పాత్రలో వారిని చూసుకునేంతగా నటించి మెప్పించారు. రాజు పాత్రలో మాస్టర్ ధృవన్ బాగా నటించాడు. సుమతి పాత్రలో అనసూయ, కోటి పాత్రలో రాహుల్ రామకృష్ణ, డానియల్ గా ధనరాజ్ తమ పాత్రల మేర బాగా నటించారు. అతిథి పాత్రలో మీరా జాస్మిన్ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.
వివేక్ కాలేపు సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. చరణ్ రాజ్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. పాటలు, సాహిత్యం చాలా అర్థవంతంగా ఉంటాయి. హను రావూరి రాసిన మాటలు చాలా బాగున్నాయి. డబ్బులో పేదరికం ఇస్తే సరే, ఆయుష్షులో కూడా పేదరికమా? లాంటి డైలాగ్స్ సినిమాలో చాలా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే కొడుకు కోసం తండ్రి పడే తపన నుంచి భావోద్వేగాలు పుష్కలంగా ఉన్నా కథనంలో కొత్తదనం లేక ప్రేక్షకుడికి బోర్ కొట్టే అవకాశం ఉంది.
చివరి మాట: ఈ ‘విమానం’ బానే ఎగిరింది. ఒకసారి ఎక్కచ్చు!
రేటింగ్: 2.5/5