ఓటిటిలు వచ్చాక వెబ్ సిరీస్ లకు ఆదరణ బాగా పెరిగిపోయింది. స్టార్ హీరోహీరోయిన్స్ సైతం ఓటిటిలలో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసేందుకు రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే చాలామంది తెలుగు హీరోహీరోయిన్స్ ఓటిటిలలో అడుగు పెట్టేశారు. ఇదే వరుసలో ఇప్పుడు దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా చేరిపోయారు. వీరిద్దరూ ప్రధాన పాత్రలలో నటించిన ఈ వెబ్ సిరీస్ తాజాగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైంది. హాలీవుడ్ ‘రే డొనోవన్’ సిరీస్ ఆధారంగా రూపొందించిన ఈ సిరీస్ ని.. వెంకీ, రానా, మేకర్స్ గట్టిగానే ప్రమోట్ చేశారు. మరి ట్రైలర్ ద్వారా తండ్రీకొడుకుల మధ్య పోరును సూచించిన ఈ రానా నాయుడు సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం!
రానా నాయుడు(రానా దగ్గుబాటి) బాలీవుడ్ సెలబ్రిటీలకు మోస్ట్ వాంటెడ్ ఫిక్సర్. వారికి ఎలాంటి సమస్య వచ్చినా.. వెంటనే వెళ్లి ప్రాబ్లెమ్స్ సెటిల్ చేసేస్తుంటాడు. అందులో భాగంగా ఇల్లీగల్ పనులను కూడా ఈజీగా సెట్ చేసేస్తాడు. ఇక రానా నాయుడి తండ్రి నాగా నాయుడు(వెంకటేష్). చంచల్‌గూడ జైల్లో 15 ఏళ్ళు శిక్షను అనుభవించి బయటికి వస్తాడు. కట్ చేస్తే.. తండ్రీకొడుకులిద్దరికీ అసలు పడదు. రానాకి పెళ్ళైపోయి భార్యాబిడ్డలతో పాటు అన్న తేజ్ నాయుడు(సుశాంత్ సింగ్), తమ్ముడు జఫ్ఫా నాయుడు(అభిషేక్ బెనర్జీ) ఉంటారు. మరి నాగా నాయుడుకి, రానాకి ఎందుకు పడదు? నాగా నాయుడు ఎందుకు 15 ఏళ్ళు జైల్లో ఉన్నాడు? అసలు వీరి కుటుంబంలో సమస్యలేంటి? అనేవి తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
ఈ సిరీస్ ఎలా ఉంది? అని చెప్పేముందు ఓ మాట. రానా నాయుడు అంతా కూర్చొని చూసే సిరీస్ కాదు. ఇందులో పుష్కలంగా బీప్ డైలాగ్స్, అడల్ట్ కంటెంట్ ఉంటుంది. సో.. 18 ప్లస్ వాళ్లే ఈ సిరీస్ చూస్తే బెటర్. అదికూడా ఫ్యామిలీతో కలిసి కాదు. వెంకటేష్ – రానా కనిపించారంటే అందరూ ఫ్యామిలీ స్టోరీ ఉంటుందని అనుకుంటారు. కానీ.. ముందస్తు వార్నింగ్ లాగే ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సిరీస్ కాదని స్వయంగా వెంకీ, రానా, మేకర్స్ ప్రమోషన్స్ లో తెలిపారు. సో.. రానా నాయుడు ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు బూతులు, అడల్ట్ కంటెంట్ ఉంటాయని మర్చిపోవద్దు. ఇక తెలుగు ప్రేక్షకులకు ఇది కంప్లీట్ కొత్త సిరీస్ గా రానా నాయుడుని చెప్పుకోవచ్చు.
ఇక సిరీస్ విషయానికి వస్తే.. స్టార్ హీరోలు వెంకీ, రానా ఉన్నప్పటికీ ఇది పక్కా తెలుగు సిరీస్ కాదు. హాలీవుడ్ రేడొనోవన్ సిరీస్ నుండి ఇన్స్పైర్ అయి తీసిన హిందీ సిరీస్. తెలుగులోకి డబ్ మాత్రమే అయ్యింది. ఈ సిరీస్ ప్రధానంగా రానా నాయుడు(రానా), నాగా నాయుడు(వెంకటేష్) క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. ఫ్యామిలీ మధ్య కలహాలను, భావోద్వేగాలను టచ్ చేస్తూనే.. క్రైమ్, యాక్షన్, మాఫియా, డ్రగ్స్ అంశాలను కొనసాగించారు. వెబ్ సిరీస్ అంటే.. ఎపిసోడ్స్ ఉంటాయి. కాబట్టి.. మెయిన్ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ.. అసలు కథలోకి తీసుకెళ్లడానికి చాలా సమయం తీసుకుంటారు మేకర్స్. రానా నాయుడు విషయంలో కూడా అదే జరిగింది.
10 ఎపిసోడ్ లతో ప్లాన్ చేసిన ఈ సిరీస్ లో అసలు కథలోకి తీసుకెళ్లేందుకు దర్శకుడు టైమ్ తీసుకున్నాడు. మెయిన్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ అయ్యాక అసలు కథ స్లోగా మొదలైంది. రానా నాయుడు, నాగా నాయుడు ఫ్యామిలీలో అసలు ఏం జరిగింది? అనేది ఇంటరెస్టింగ్ గా ఉన్నప్పటికీ.. నాగా, రానా ఎదురు పడినప్పుడు వచ్చే సన్నివేశాలు ఓకే అనిపిస్తూనే.. వారి క్యారెక్టర్స్ వెనుక ఎమోషనల్ టచ్ ఉందని అర్థమవుతుంది. అయితే.. ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ మధ్య బాండింగ్ అనేది ఏమాత్రం తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండదు. అడ్వాన్స్ డ్ బాలీవుడ్ కల్చర్ లోనే క్యారెక్టర్స్, స్టోరీ సాగుతుంది.
రెగ్యులర్ గా హాలీవుడ్ సిరీస్ లు చూసేవారికి రానా నాయుడు.. పెద్ద థ్రిల్లింగ్ అనిపించకపోవచ్చు. పైగా ఎక్కడబడితే అక్కడ బీప్ డైలాగ్స్ ఉండేసరికి.. తెలుగు వాళ్ళు జీర్ణించుకోవడానికి టైమ్ పట్టవచ్చు. ఇందులో పది ఎపిసోడ్స్ మినిమమ్ 50 నిముషాలు ఉన్నాయి. రఫ్ గా పది గంటలు అనుకోవచ్చు. మొదటి రెండుమూడు ఎపిసోడ్స్ తర్వాత కథాకథనాలలో వేగం కనిపిస్తుంది. కాబట్టి.. మూడో ఎపిసోడ్ తర్వాత నుండి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. రానా నాయుడు, నాగా నాయుడు క్యారెక్టర్స్ తో పాటు తేజ్ నాయుడు, జఫ్ఫా నాయుడు క్యారెక్టరైజేషన్స్ ఆకట్టుకుంటాయి. అయితే.. మెయిన్ గా రెండు పాత్రల చుట్టూ తిరుగుతున్నా.. మిగతా క్యారెక్టర్స్ కి కూడా ప్రాధాన్యత ఇచ్చారు మేకర్స్.
క్లైమాక్స్ లో కి వచ్చేసరికి మీ మైండ్ లో ఉన్న ప్రశ్నలకు ఒక్కో సందర్భాలను జోడించి.. ట్విస్టులు, వాటి తాలూకు ఎమోషన్స్ రివీల్ అవుతుంటాయి. సో.. ప్రెజెంట్ బెస్ట్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్న వారికి రానా నాయుడు మంచి ఆప్షన్. కానీ.. ఫ్యామిలీతో చూడొద్దు. ఇక ఎవరి క్యారెక్టర్స్ లో వారు బాగా మెప్పించారు. ముఖ్యంగా రానా నాయుడు క్యారెక్టర్ లో రానా కొత్తగా అయితే లేడు. ఇలాంటి హీరోయిక్-రౌడీ బిహేవియర్ ఇదివరకే చూశాం. బట్ వెంకీకి పోటీగా ఎలా ఉందో చూడాలనుకుంటే నచ్చవచ్చు. ఇక నాగా నాయుడుగా వెంకీ రఫ్ఫాడించేసాడు. ఆయన నుండి కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ చూసిన ప్రేక్షకులు.. ఈసారి వైల్డ్ యాంగిల్ కూడా చూడవచ్చు.
మిగతా క్యారెక్టర్స్ అన్ని కథ మేరా సాగాయి. ఇక మేకర్స్ కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ.. హాలీవుడ్ సిరీస్ ని అడాప్ట్ చేసిన విధానం బాగుంది. ఆడియెన్స్ కి మాత్రం రానా నాయుడు కొత్త ఫీల్ అయితే కలిగిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్స్ సంగీత్, సిద్ధార్థ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కావాల్సిన మేరా అందించారు. కానీ.. బాలీవుడ్ ఫ్లేవర్ ఖచ్చితంగా కనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ జయకృష్ణ గుమ్మడి వర్క్ చాలా బాగుంది. నీట్ గా ప్రెజెంట్ చేశాడు. ఎలాగో నెట్ ఫ్లిక్స్ నిర్మించింది కాబట్టి.. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు. క్లైమాక్స్ లో ‘రానా నాయుడు 2’కి లీడ్ ఇస్తూ ఎండ్ అయ్యింది. సో.. కొత్తదనాన్ని కోరుకునే 18 ప్లస్ ఆడియెన్స్ కి రానా నాయుడు ఫీస్ట్ అని చెప్పవచ్చు.