తెలుగు సినిమా ప్రేక్షకులు నిజంగా దేవుళ్లు! ఎందుకంటే ఏ భాష మూవీ అయినా సరే నచ్చితే చాలు.. గుండెల్లో పెట్టేసుకుంటారు. సినిమా బాగుందని నలుగురికి చెబుతారు. అందులో హీరో, డైరెక్టర్ మనోడా కాదా అని అస్సలు పట్టించుకోరు. అలా ఈ మధ్య కాలంలో పరభాష సినిమాలు మనల్ని ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ముందు ముందు కూడా చేస్తాయి. గతేడాది ‘జాతిరత్నాలు’ లాంటి కామెడీ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ అనుదీప్.. ఇప్పుడు తమిళ హీరో శివకార్తికేయన్ తో ‘ప్రిన్స్’ తీశాడు. శుక్రవారం(అక్టోబరు 21న) ఇది థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనుదీప్ మరో హిట్ కొట్టాడా లేదా తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
ఆనంద్(శివకార్తికేయన్).. కృష్ణా జిల్లాలోని దేవరకోటలోని ఓ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తుంటాడు. కానీ స్కూల్ కి అప్పుడప్పుడు మాత్రమే వెళ్తుంటాడు. అలాంటి ఆనంద్.. టీచర్ గా జాయిన్ బ్రిటీష్ భామ జెస్సిక(మరియా ర్యాబోషప్క) కోసం స్కూల్ కి వెళ్లడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరూ ప్రేమలో కూడా పడతారు. ఇక తన పెళ్లికి తండ్రి విశ్వనాథం(సత్యరాజ్) నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని ఆనంద్ అనుకుంటాడు. కానీ సీన్ రివర్స్ అవుతుంది. బ్రిటీష్ భామతో పెళ్లికి ఆయన ఒప్పుకోడు. దీనికి తోడు ఆనంద్ లవ్ స్టోరీ వల్ల ఊరిలో మరిన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. చివరికి తండ్రితో పాటు ఊరి ప్రజలని ఆనంద్ ఎలా కన్విన్స్ చేశాడు? తన ప్రేమకథని పెళ్లి వరకు ఎలా తీసుకెళ్లాడు? అనేది తెలియాలంటే మీరు థియేటర్ కి వెళ్లి సినిమా చూడాల్సిందే.
‘జాతిరత్నాలు’ తర్వాత అనుదీప్ డైరెక్ట్ చేసిన మూవీ ప్రిన్స్. నార్మల్ గానే ఈ రెండింటిని ప్రేక్షకులు పోల్చి చూడటం చాలా కామన్. దానికి తోడు కామెడీ సినిమాలతో ఓ సమస్య ఉంటుంది. ప్రేక్షకులు స్టోరీ కంటే కామెడీనే ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేస్తారు. జాతిరత్నాలు సినిమాలో అలా లాజిక్ లేని కామెడీ విపరీతంగా ఉంటుంది. అప్పటి పరిస్థితులు కూడా కలిసి రావడంతో సినిమా హిట్ అయింది. ‘ప్రిన్స్’ సినిమాకు అలా ఏం కుదరలేదు. ఎందుకంటే ఇది కామెడీ చిత్రం మాత్రమే కాదు. ఇందులో ఓ మెసేజ్(సందేశం) కూడా ఉంది. ఈ సినిమాలో కామెడీ కొన్ని సీన్స్ లో మాత్రమే వర్కౌట్ అయింది. మెజారిటీ సన్నివేశాల్లో వర్కౌట్ కాలేదు! ‘జాతిరత్నాలు’ మ్యాజిక్ ని రీ క్రియేట్ చేయడంలో అనుదీప్ మాత్రం కాస్త తడబడ్డాడు. ఎందుకంటే ‘జాతిరత్నాలు’ సినిమాలో నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా పాత్రలకు ప్రత్యేక మేనరిజం ఉంటుంది. అదే ఆ సినిమా మేజర్ ప్లస్ అయింది. ‘ప్రిన్స్’లో మాత్రం అలాంటిది మిస్ అయింది.
ఇక యాక్టింగ్ విషయానికొస్తే.. డాక్టర్, డాన్ సినిమాలు చూసిన వాళ్లకు శివకార్తికేయన్ స్టామినా ఏంటో తెలుసు. స్టోరీ ఏదైనా సరే తన మార్క్ కామెడీ, డ్యాన్సులతో మనోడు రెచ్చిపోతాడు. ‘ప్రిన్స్’లోనూ అలాంటి రోల్ కావడంతో అలా చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఉక్రెయిన్ భామ మరియాకు ఇది తొలి సినిమా. యాక్టింగ్ గురించి పక్కనబెడితే ఆమె నవ్వు బాగుంది. ల్యాండ్ కబ్జా మాఫియా డాన్ పాత్రలో ప్రేమ్ జి కొంతమేర నవ్వించారు. హీరో తండ్రిగా సత్యరాజ్ ఓకే. మిగతా పాత్రధారులు పరిధిమేర యాక్టింగ్ చేశారు. కానీ వీరిలో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు చాలా తక్కువ.
ఇక టెక్నికల్ విషయానికొస్తే… ఈ సినిమా మొత్తాన్ని పాండిచ్చేరి లోకేషన్స్ లో తీశాడు. ఈ విజువల్స్ ని సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస అంతే అందంగా చూపించారు. తమన్ సంగీతంతో పాటు అతడు పాడిన జెస్సికా, బింబిలిక్కి పాటలు బాగున్నాయి. కానీ కొన్ని పాటల ప్లేస్ మెంట్.. స్టోరీకి బ్రేకులు వేసినట్లు అనిపించింది. హీరోహీరోయిన్లు మాత్రం డ్యాన్సుతో అదరగొట్టేశారు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఇక ఫైనల్ గా రైటర్ అండ్ డైరెక్టర్ అనుదీప్ గురించి చెప్పాలి. తన అచ్చొచ్చిన కామెడీ జానర్ లోనే ‘ప్రిన్స్’ తీసిన అనుదీప్.. ఇందులో కామెడీ కంటే డైలాగ్స్ పై ఎక్కువ ఫోకస్ చేశాడు. సినిమా స్టార్టింగ్ లో కొన్ని సీన్స్, పోలీస్ స్టేషన్ సీన్, క్లైమాక్స్ సీన్స్ బాగా రాసుకున్నాడు. మిగతా సినిమాలో మాత్రం ఆ స్థాయి పెన్ పవర్ చూపించలేకపోయాడు. ఓవరాల్ గా చెప్పాలంటే ‘జాతిరత్నాలు’ పోల్చి చూడకూండా ‘ప్రిన్స్’ చూస్తే మాత్రం మీకు నచ్చొచ్చు!
రేటింగ్: 2.5
చివరిమాట: లాజిక్స్ వెతక్కుండా చూస్తే ‘ప్రిన్స్’ నవ్విస్తుంది