ఆ మద్య జయం రవితో ‘కొమాలి’ మూవీ తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు ప్రదీప్ రంగనాధన్. తానే హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘లవ్ టుడే’. ఈ మూవీ తమిళనాట ఘన విజయం సాధించింది. కేవలం 5 కోట్ల బడ్జెట్ తో ఏకంగా యాబై కోట్ల కలెక్షన్లకు పైగా వసూళ్లు చేసింది. ప్రదీప్ రంగనాధన్, ఇవానా, సత్యరాజ్, రాధికా శరత్ కుమార్ లు ముఖ్య భూమిక పోషించారు. ఈ మూవీని అదే పేరుతో తెలుగు లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ డబ్ చేశారు. ఈ మూవీ శుక్రవారం రిలీజ్ అయ్యింది. తమిళ వర్షన్ మంచి సక్సెస్ అయ్యింది.. మరి తెలుగు లో ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తుందో చూద్దాం..
ప్రదీప్ ఉత్తమన్ ( ప్రదీప్ రంగనాధన్) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. నిఖిత (ఇవానా) ఆమె కూడా అదే కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఒకే కంపెనీ లో ఉద్యోగం చేస్తున్న ఇద్దరూ ప్రేమలో పడతారు. అలా కొన్నిరోజులు ఇద్దరూ ఎంజాయ్ చేస్తారు.. ఇక పెళ్లితో ఒక్కటవుదామని అనుకుంటారు. నిఖిత తండ్రి వేణు శాస్త్రి(సత్యరాజ్) దగ్గరకి వెళ్లి తమ ప్రపోజల్ చెబుతారు. దానికి ఆయన ఓ కండీషన్ పెడతాడు. ఇద్దరూ తమ సెల్ ఫోన్ ఒకరిదొకరు మార్చుకోవాలని.. అలా ఒక్కరోజు గడిపిన తర్వాత పెళ్లి చేసుకుంటామని అంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతాడు. ఇక తమ ఫోన్లు ఒకరికొకరు మార్చుకున్న తర్వాత ప్రదీప్, నిఖిత ఎలాంటి ఇబ్బందులు పడతారు.. ఫోన్లలో ఉన్న రహస్యాలు ఎలాంటివి? వారి నిజ స్వరూపాలు ఎలా బయటపడ్డాయి? చివరికి ఏం జరుగుతుంది? ఇద్దరి పెళ్లి అవుతుందా? అన్నదే కథ.
ఈ కాలంలో సెల్ ఫోన్ కి ఎంత ప్రాధాన్యత ఉంతో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా సెల్ ఫోన్ కి బానిస అవుతున్నారు. ఒక్కపూట సెల్ లేకపోతే తమకు బతుకే లేదన్నంత భ్రమలో బతికేస్తున్నారు. సెల్ ఫోన్ మాయలో పడి బంధుత్వాలు కూడా మర్చిపోతున్నారు. అయితే ఈ సెల్ ఫోన్ వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయని ఎప్పుడూ.. ఏదో ఒక రూపంలో సోషల్ మీడియాలో కథనాలు వస్తూనే ఉంటాయి.. కానీ జనాలు పట్టించుకోరు. సెల్ ఫోన్ లో తమకు సంబంధించిన ప్రతి ఒక్కటీ గుట్టుగా దాచుకంటారు.. ఒకవేళ అది ఎవరికంట పడ్డా.. దొరికినా దాని పర్యావసానాలు ఎంత దారుణంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఒక సెల్ ఫోన్ వేరే వాళ్ల చేతిలోకి పోతే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందనే కాన్సెప్ట్ తో అల్లుకున్న కథ ఎంతో చక్కగా ఉందనిపిస్తుంది.
లవ్ టుడేలో ఇప్పటి యూత్ ఎలా ఉంటారు.. ముఖ్యంగా సెల్ ఫోన్ వారి ప్రపంచంగా భావించేవారి గురించి సెటైర్లు వేస్తూనే.. కడుపుబ్బా నవ్వించాడు దర్శకుడు ప్రదీప్ రంగనాధన్. ఈ కాలంలో మనిషి నిజస్వరూపం గురించి తెలుసుకోవాలంటే.. అతన్నీ పూర్తిగా పరిశీలించనక్కరలేదు.. అతడి సెల్ ఫోన్ ఒక్కటి స్టడీ చేస్తే చాలు.. మనిషి ముసుగు తొలగిపోతుందని దర్శకుడు ఈ చిత్రంతో పరోక్షంగా చెప్పాడు. ఇప్పటి యూత్ సోషల్ మీడియాను ఏ రేంజ్ లో వాడుకుంటున్నారు.. అలాగే సైబర్ క్రైమ్స్ ప్రభావం మనుషులపై ఎలా పడుతుందన్న విషయం కూడా టచ్ చేశాడు డైరెక్టర్. ఒకప్పుడు ఈ రోజుల్లో, బస్టాప్ లాంటి యూత్ ఫుల్ మూవీస్ చూసి ఎలా ఎంజాయ్ చేశారో తెలిసిందే. ఇప్పటి యూత్ పై సెల్ ఫోన్ ప్రభావం ఎలా ఉంటుందో.. కథ, కథనం అంతా ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టుగానే తెరకెక్కించాడు దర్శకుడు. ఈ మూవీకి లవ్ టుడే అనే టైటిట్ బాగా సెట్ అయినట్టు అనిపిస్తుంది.
ఈ మూవీలో ఎంత కామెడీ ఉంటుందో.. అదే స్థాయిలో ఎమోషన్ సీన్లు కూడా పండించాడు. ఫోన్ ఎక్స్ ఛేంజ్ అనే కాన్సెప్ట్ చాలా సింపుల్ గా ఉన్నా దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో మూవీలో కళ్లకు కట్టినట్టుగా చూపించిన తీరు ప్రశంసనీయం. ఇప్పటి బంధాలు, బంధుత్వాలు సెల్ ఫోన్ తో ఎలా ముడిపడి ఉన్నాయో చూపించారు, సోషల్ మీడియాలో మెసేజ్ లు అమ్మాయిల పై ఎలాంటి ప్రభావాలు పడతాయో, సోషల్ మీడియా వేధికగా అమ్మాయి, అబ్బాయి అప్రోచ్ అయ్యే విధానం ఆసక్తిగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు. దర్శకుడిగానే కాకుండా హీరోగా ప్రదీప్ రంగనాధన్ ఈ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడనే చెప్పొచ్చు.
ఇక హీరోగా రంగనాధన్ తన నటన చూస్తే మన మధ్య ఉన్న వ్యక్తులే గుర్తుకు వస్తుంటారు.. అంత న్యాచురల్ గా నటించాడు. హీరోయిన్ గా ఇవానా ఈ కాలం అమ్మాయిలు ఎలా ఉంటారో తన నటనలో చూపించింది మెప్పించింది. సీనియర్ నటులు సత్యరాజ్, రాధిక నటన చాలా అద్భుతంగా ఉంది.. ఈ కాలం తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండారు.. వారు ఎదుర్కొంటున్న సమస్యలు తమ నటనతో పండించారు. అలాగే యోగిబాబు, రవీవారవి కామెడీ హైలెట్ గా నిలిచాయి. ఇక ఈ మూవీకి సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ అన్నీ అద్భుతంగాకుదిరాయనే చెప్పొచ్చు. యువన్ శంకర్ తన ట్రెండీ మ్యూజిక్ తో వండర్ క్రియేట్ చేశాడు. ఫన్నీ, ఎమోషనల్ సీన్లలో నేపధ్య సంగీతంతో సూపర్ అనిపించాడు. మొత్తానికి లవ్ టుడే ఈ కాలం ఉన్న పరిస్థితులు, సోషల్ మీడియా వల్ల జరిగే నష్టాలు నవ్విస్తూనే ఆలోచింపజేసే విధంగా చూపించాడు.
చివరిమాట: లవ్ టుడే.. నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది