తమిళ స్టార్ యాక్టర్ పార్తీబన్ గురించి దక్షిణాది సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశాడు. ఓవైపు దర్శకుడిగా సినిమాలు చేస్తూనే.. నటుడిగా కూడా కొనసాగుతున్నాడు. ఎలాంటి కథలైనా కొత్తగా చెప్పడంలో.. కొత్త తరహా స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను మెప్పించడంలో పార్తీబన్ రూటే వేరు. తాజాగా పార్తీబన్ ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘ఇరవిన్ నిళల్’ మూవీ.. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ మొదలైంది. ఇదివరకే థియేట్రికల్ రిలీజై సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమా.. ‘నాన్-లీనియర్ సింగిల్ షాట్ ఫిల్మ్’ కేటగిరీలో ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. మరి ఈ ‘ఇరవిన్ నిళల్’ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
మనిషి జీవితంలోని ఎదుగుదల, పతనం అనే అంశాల చుట్టూ సాగే కథ ఇది. నందు(పార్తీబన్) ఎన్నో విషాదాల మధ్య జీవితాన్ని సాగిస్తున్న మిస్టరీ మ్యాన్. ఫిల్మ్ ఫైనాన్సియర్ అయిన నందు.. పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారని తెలిసి పరారీలో ఉంటాడు. నకిలీ దేవుడిగా చలామణి అవుతున్న పరమానంద(రోబో శంకర్)ని కాల్చి చంపేయాలని.. అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. అప్పటికే లైఫ్ అంతా నేరాలతో, పాపాలతో అంధకారంలో ఉండేసరికి.. తనను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వ్యక్తుల గురించి చెబుతాడు. ఈ క్రమంలో నందు లైఫ్ లో ఉన్న లక్ష్మి(స్నేహ కుమార్), చిలకమ్మ (బ్రిగిడా సాగా), పార్వతి (సాయి ప్రియాంక రూత్), ప్రేమకుమారి (వరలక్ష్మి శరత్‌కుమార్)ల గురించి తెలుస్తుంది. మరి నందు లైఫ్ లో దాగి ఉన్న విషాదాలు ఏంటి? నందు పరమానందను ఎందుకు చంపాలని చూస్తున్నాడు? నందుని పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు? నందు లైఫ్ లో ఉన్న ఈ అమ్మాయిలు ఎవరు? అనేది సినిమాలో చూడాల్సిందే.
ఒక స్టోరీ టెల్లర్ గా పార్తీబన్ మూవీ మేకింగ్ గురించి ప్రేక్షకులకు బాగా తెలుసు. ఎందుకంటే.. తన ప్రతి సినిమాతో ప్రేక్షకులకు ఏదో ఒక కొత్త అనుభూతిని కలిగించాలని ఆలోచిస్తుంటాడు. దర్శకుడిగా పార్తీబన్ తీసిన ఏ సినిమాలోనైనా కామన్ విషయం ఏంటంటే.. స్క్రీన్ ప్లే, ట్విస్టుల పరంగా సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. ఈ సినిమా విషయంలో కూడా అదే మ్యాజిక్ క్రియేట్ చేశాడు పార్తీబన్. ‘ఇరవిన్ నిళల్’ అనే టైటిల్ సినిమాలో హీరో క్యారెక్టర్ కి సరిగ్గా సరిపోయింది. ‘ఇరవిన్ నిళల్’ అంటే తెలుగులో చీకటి నీడ. అందుకు తగ్గట్టుగానే సినిమా కథాకథనాలను రాసుకున్నాడు దర్శకుడు. సినిమా మొదలైనప్పటి నుండి ఎండింగ్ వరకు అలా కూర్చోబెట్టేశాడు.
అందమైన కథలలో ఎంత విషాదం దాగిఉన్నా.. తెరపై ప్రెజెంట్ చేసినప్పుడే దర్శకుడి ప్రతిభ బయట పడుతుంది. ఇక్కడ పార్తీబన్ ప్రతిభ గురించి కాదు.. కానీ.. ఒక విషాదం నిండిన జీవితంలో వెలుగు పుట్టించే వైపుగా వైవిధ్యంగా ప్రెజెంట్ చేసిన క్రెడిట్ పార్తీబన్ కే దక్కుతుంది. కథ కొత్తదైనా పాతదైనా.. క్లైమాక్స్ బట్టే ప్రేక్షకుల మదిలో ఎక్కువకాలం నిలుస్తాయి. ఈ సినిమా కూడా ఆ కోవకే చెందుతుంది. మంచి స్టోరీలో క్లైమాక్స్ ని ఎవరూ ఊహించని విధంగా ప్లాన్ చేశాడు డైరెక్టర్. అందుకే సినిమా చూసినవారు అంత త్వరగా దాని నుండి బయటికి రాలేరు. ఊహించలేని కథాకథనాలు, క్లైమాక్స్ ఉన్నప్పుడే కదా సినిమా ప్రేక్షకులలో ఇంపాక్ట్ క్రియేట్ చేసేది.
సినిమాలోకి వెళ్తే.. నందు(పార్తీబన్) ఫిల్మ్ ఫైనాన్సియర్, తనను పోలీసులు అరెస్ట్ చేస్తారని తెలిసి.. గన్ తీసుకొని పరారీలో ఉంటాడు. నకిలీ దేవుడిగా చలామణి అవుతున్న పరమానంద(రోబో శంకర్)ని చంపాలని చూస్తుంటాడు. ఎందుకంటే.. నందు జీవితంలో ఇంతటి అంధకారం నింపిన వారిలో పరమానంద ఒకడు. ఇలా ఇంటరెస్టింగ్ ఓపెనింగ్ సీన్ తో సినిమా మొదలవుతుంది. అక్కడినుండి తన లైఫ్ లో జరిగిన విషాదాలు.. విశేషాలను ఎలా వివరించాడు.. అతని లక్ష్యం ఏంటనేది మిగతా సినిమా. అయితే.. ఇలాంటి మిస్టరీ థ్రిల్లర్ కథలకు స్క్రీన్ ప్లేనే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదీగాక నాన్-లీనియర్ స్క్రీన్ ప్లేలో భాగంగా ఈ సినిమా కోసం సింగిల్ షాట్ ప్యాటర్న్‌ని ఎంచుకున్నారు.
అలా మొదలైన నందు కథలో.. చిన్నప్పటి నుండే అనాథగా పెరిగిన నందు.. సమాజంలో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడు.. బతుకుదెరువు కోసం ఎలా నేర ప్రపంచంలోకి ఎలా వెళ్ళాడు? అతని లైఫ్ లో ‘ప్రేమ’ అనేది ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది? ఆ ప్రేమ అతన్ని లైఫ్ ని కాపాడిందా ఇంకా కష్టాల్లోకి నెట్టిందా? అనే విధంగా ఈ సినిమా కథనాన్ని ఆసక్తికరంగా నడిపించాడు పార్తీబన్. ఈ క్రమంలో నందు లైఫ్ లోకి వచ్చిన లక్ష్మి (స్నేహ కుమార్), చిలకమ్మ (బ్రిగిడా సాగా), పార్వతి (సాయి ప్రియాంక రూత్), ప్రేమకుమారి (వరలక్ష్మి శరత్‌కుమార్)ల కారణంగా అతని జీవితం సానుకూల, ప్రతికూల పరిస్తితులను ఎదుర్కొంది అనేది బాగా చూపించాడు.
ఈ సినిమాలో ప్రేక్షకులు క్లాప్స్ కొట్టి, విజిల్స్ వేసే సన్నివేశాలు చాలా ఉన్నాయనే చెప్పాలి. అన్ని పాత్రలను, పాత్రల తీరుతెన్నులను చాలా క్లియర్ గా రాసుకున్నాడు దర్శకుడు. ఆ పాత్రలకు అందరు నటీనటులు న్యాయం చేశారని చూస్తుండగానే అర్థమవుతుంది. అంతేగాక ఈ సినిమా పార్తీబన్ తో పాటు మరికొందరు చాలా కష్టపడ్డారు. వారి కష్టం సన్నివేశాలలో కనిపిస్తుంది. అయితే.. పాత సీసాలో నింపిన సరికొత్త వైన్ అని కూడా చెప్పవచ్చు. కానీ.. అదే ఈ సినిమాలో అసలు మేజిక్కు. ఇక సినిమా కథాకథనాలు ఎంత బ్రిలియెంట్ గా ఉన్నాయో.. అక్కడక్కడా చిన్న చిన్న మిస్టేక్స్ కూడా కనిపిస్తాయి. ఏంటంటే.. సినిమాలో అన్ని పాత్రలు ఉన్నా.. ఒకే క్యారెక్టర్ పై ఎక్కువ ఫోకస్ పెట్టరేమో అనిపిస్తుంది. డిఫరెంట్ టైమ్స్ లో పార్తీబన్ క్యారెక్టర్ లో మార్పులు కొత్తగా అనిపిస్తాయి.
కొన్నిసార్లు సినిమాలలో స్పీడ్ గా ఉంటే బాగుండేది అనుకుంటాం. దీనిలో అది ఉల్టా జరుగుతుంది. కథనం కాస్త నెమ్మదిగా సాగితే బాగుండేదేమో అని కొన్నిచోట్ల అనిపించవచ్చు. ఎమోషన్స్ కి సినిమాలో చాలా స్కోప్ ఉంది. కాకపోతే.. ఇంకా బలంగా చూపించి ఉంటే బాగుండేది. విక్టోరియా లేదా 1917 వంటి సింగిల్-షాట్ ఫిల్మ్‌లలో సింగిల్ షాట్ టెక్నిక్ ని మనం చూసాం. కానీ ఇందులో, ప్రధానంగా నందు జర్నీనే పాయింట్. ఈ టెక్నిక్ తో ఊహించని కథ, క్లైమాక్స్ ని చెప్పడం అంటే మామూలు విషయం కాదు. దర్శకుడిగా, కథకుడిగా పార్తీబన్ సక్సెస్ అయ్యాడు. ఆశ్చర్యం కలిగించే సన్నివేశాలకు తోడు.. ఏఆర్ రెహమాన్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. ఆర్థర్ ఏ. విల్సన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. పార్తీబన్ తో పాటు మిగిలిన నటీనటులంతా సినిమాకు న్యాయం చేశారు. ఇలాంటి మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ జనాలకు బాగా నచ్చవచ్చు.