టాలీవుడ్ లో హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్న హీరో సుధీర్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, మహేష్ బాబు బావగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ కోసం కష్టపడుతున్నాడు. ప్రేమకథాచిత్రమ్, భలే మంచి రోజు, సమ్మోహనం, నన్ను దోచుకుందువటే లాంటి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నా.. హిట్స్ ట్రాక్ ని మెయింటైన్ చేయలేకపోతున్నాడు. రీసెంట్ గా వి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలతో పలకరించిన సుధీర్.. ఇప్పుడు ‘హంట్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
అసిస్టెంట్ కమీషనర్ ఆర్యన్ దేవ్(ప్రేమిస్తే భరత్) హత్యకు గురవ్వడంతో పోలీస్ డిపార్ట్ మెంట్ ఒక్కసారిగా షాక్ కి గురవుతుంది. వెంటనే చనిపోయిన ఆర్యన్ దేవ్ కేసు నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ అర్జున్ ప్రసాద్(సుధీర్ బాబు) చేతికి వెళ్తుంది. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న అర్జున్ కి ఇన్వెస్టిగేషన్ టైంలో అనుకోకుండా యాక్సిడెంట్ జరుగుతుంది. కట్ చేస్తే.. ప్రమాదంలో అర్జున్ తన పూర్తి గతాన్ని మర్చిపోతాడు. మరి ప్రమాదం నుండి కోలుకున్న తర్వాత అర్జున్ ఈ కేసును ఎలా సాల్వ్ చేశాడు? ఆర్యన్ దేవ్ ని హత్య చేసింది ఎవరు, ఎందుకు చేశారు? ఈ కేసులో అర్జున్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు ? అనేది తెలియాలంటే మూవీని తెరపై చూడాల్సిందే.
పోలీస్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ అంటే.. జనాలకు ఎప్పుడూ ఆసక్తికరంగానే అనిపిస్తాయి. ఎందుకంటే.. పోలీస్ స్టోరీస్ అన్నీ దాదాపు ఏదొక కేసును, సీరియస్ ఇష్యూ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇంట్రెస్టింగా గా సాగుతుంటాయి. కాబట్టి.. ఎప్పుడైనా సరే కాప్ స్టోరీస్ కి ఉండే క్రేజ్ అలాగే ఉంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే సుధీర్ బాబు ఈ ‘హంట్’ సినిమా ట్రై చేశాడేమో అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కినప్పటికీ, ఈ సినిమాలో ఓ జెన్యూన్ అటెంప్ట్ కనిపిస్తుంది. కొన్నిసార్లు ఇన్వెస్టిగేషన్ డ్రామాస్ లో కూడా హీరోయిన్స్ ని ఎక్కడో చోట పెట్టేసి.. గ్లామర్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు.
ఈ సినిమాలో హీరోయిన్ ఉండదు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా అర్జున్ ప్రసాద్ పోరాటం మాత్రమే తెరపై ఎస్టాబ్లిష్ చేశారు. పోలీస్ కథలు చాలా వచ్చినా.. ఇన్వెస్టిగేషన్ మధ్యలో యాక్సిడెంట్.. దాంతో పోలీస్ మెమోరీ లాస్ అవ్వడం.. కేసు వివరాలు మర్చిపోవడం.. ఆ తర్వాత మళ్లీ కేసును పునఃప్రారంభించి సాల్వ్ చేయడం అనేది కొత్త ఫీల్ ని ఇస్తుంది. తెలుగులో ఇప్పటిదాకా ఇలాంటి పాయింట్ తో పాటు హంట్ లో ఉన్న ట్విస్టులు కూడా ఆడియెన్స్ కి థ్రిల్ కలిగించేలా ఉండటం విశేషం. కానీ.. ఆల్రెడీ ఇదే స్టోరీ లైన్ తో పదేళ్ల క్రితమే మలయాళంలో ‘ముంబై పోలీస్'(2013) అనే సినిమా వచ్చింది.
పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ముంబై పోలీస్ సినిమా.. కమర్షియల్ గా ఆడకపోయినా ప్రేక్షకుల నుండి, క్రిటిక్స్ నుండి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు అదే సినిమాని రీమేక్ చేశారేమో అనిపిస్తుంది. రీమేక్ అని ఆఫీషియల్ గా ప్రకటించలేదు. కాబట్టి.. ఫ్రీమేక్ అని కూడా అనుకోవచ్చు. కానీ.. మంచి సబ్జెక్టుని ఎంచుకున్నారని చెప్పవచ్చు. రెగ్యులర్ హీరోహీరోయిన్, రొమాన్స్, లవ్ లాంటి అంశాలు లేకుండా కంప్లీట్ యాక్షన్, సీరియస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తీసుకెళ్లిపోయారు. ఒక్కోసారి పూర్తి సీరియస్ గా ఉన్నా మైనస్ అవుతుంటాయి. ఇక ఈ సినిమాలో చనిపోయిన అసిస్టెంట్ కమీషనర్ ఆర్యన్ దేవ్.. హత్య కేసును అర్జున్ ప్రసాద్ ఎలా సాల్వ్ చేశాడు అనేది ఆసక్తికరమైన పాయింట్.
ట్రైలర్ చూపించిన అంశాలతో పాటు సినిమాలో కొన్ని ట్విస్టులు ఉన్నాయి. సినిమా విషయానికి వస్తే.. అసిస్టెంట్ కమీషనర్ ఆర్యన్ దేవ్ హత్య కేసును పరిచయం చేస్తూ సినిమా మొదలవుతుంది. అప్పుడే ఆ కేసును సాల్వ్ చేసేందుకు అర్జున్ ప్రసాద్(సుధీర్ బాబు) ఎంట్రీ.. కేస్ టేకప్ చేశాక ఆసక్తికరమైన ఇన్వెస్టిగేషన్.. అనుకోకుండా అర్జున్ కి కార్ యాక్సిడెంట్..గతం మర్చిపోవడం.. మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మధ్య ఓ షాకింగ్ ట్విస్ట్ తో ఇంటర్వెల్ ప్లాన్ చేశారు. ఇంటర్వెల్ అయ్యాక.. అసలు కథలో అసలు కొత్తదనం కనిపిస్తుంది. సెకండాఫ్ లో మెమోరీ లాస్ అయిన అర్జున్.. కేస్ ని ఎలా సాల్వ్ చేశాడనేది కొన్ని ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ తో సాగింది.
ఇక యాక్సిడెంట్ నుండి కోలుకున్నాక.. అర్జున్ ప్రసాద్ కి పై ఆఫీసర్స్ ఒత్తిడి.. కేసులో ఏ ఒక్క క్లూ దొరక్కపోవడం.. అసలు హత్య చేసింది ఎవరు? ఎందుకు చేశారు? అనే సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ.. థ్రిల్లింగ్ కలిగించేలా ఒక్కో ముడిని విప్పుకుంటూ స్క్రీన్ ప్లేని బిగువుగా రాసుకున్నారు. కాకపోతే.. రీమేక్ సినిమా కదా.. దానికంటే బెటర్ ట్రీట్ మెంట్ ఇవ్వడంలో మేకర్స్ తడబడ్డారని అనిపిస్తుంది. కమర్షియల్ హంగులు, ఎంటర్టైన్ మెంట్ లేకపోవడంతో అక్కడక్కడా స్క్రీన్ ప్లే గ్రిప్ తగ్గి.. ఆ లోటు కనిపిస్తుంది. అయితే.. ఎఫర్ట్స్ పరంగా అందరూ వందశాతం పెట్టారని చెప్పవచ్చు. ముఖ్యంగా సుధీర్ బాబు ఫిట్నెస్ ఫ్రీక్, పోలీస్ రోల్ కాబట్టి.. చక్కగా సరిపోయాడు. యాక్షన్ సన్నివేశాలలో అదరగొట్టాడు. సినిమా నిడివి ఓకే.. కానీ.. స్క్రీన్ ప్లే ఉత్కంఠగా లేకపోగా నేరేషన్ స్లోగా సాగడం మైనస్.
ప్రేమిస్తే భరత్ చాలాకాలం తర్వాత తెలుగులో సినిమా చేశాడు. ఆర్యన్ దేవ్ పాత్రలో ఉన్నంతవరకు న్యాయం చేశాడు. ఓ రకంగా ఈ సినిమా ఫ్రెండ్ కోసం చేసే పోరాటం అని కూడా చెప్పుకోవచ్చు. పై అధికారిగా శ్రీకాంత్ కి స్క్రీన్ స్పేస్ బాగా లభించింది. ఈ సినిమాలో కానిస్టేబుల్ గా సోషల్ మీడియా స్టార్ మౌనిక రెడ్డికి చిన్న రోల్ లో మెరిసింది.. సినిమాటోగ్రఫీ అరుళ్ విన్సెన్ట్ వర్క్ కొన్ని చోట్ల మెప్పిస్తుంది. కానీ.. అద్భుతమైతే క్రియేట్ చేయలేదు. మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి కావాల్సినంత లెవెల్ లో ఇచ్చాడు. నిర్మాత వి. ఆనంద్ ప్రసాద్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక దర్శకుడు మహేష్.. ఇంకాస్త స్క్రీన్ ప్లేని గ్రిప్పింగ్ గా రాసుకొని ఉంటే బాగుండేది. కానీ.. అతని ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. బెస్ట్ థ్రిల్లర్ కావాల్సిన హంట్.. నార్మల్ హంట్ గానే మిగిలే అవకాశం ఉంది. కానీ.. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.