టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగి స్టార్ డమ్ ని, సెపరేట్ మాస్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో రవితేజ. కెరీర్ లో హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. గతేడాది ‘క్రాక్’ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ.. ఆ తర్వాత వచ్చిన కిలాడీ, రామారావు ఆన్ డ్యూటీలతో నిరాశపరిచాడు. ఇప్పుడు తనకు బాగా కలిసి వచ్చిన యాక్షన్ కామెడీ జానర్ లో ‘ధమాకా’ చేశాడు. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేసిన ఈ మూవీ.. తాజాగా థియేటర్లలో విడుదలైంది. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తీశారు. మరి యాక్షన్ కామెడీ అంటూ వచ్చిన ‘ధమాకా’ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
స్వామి(రవితేజ) ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి.. ఉద్యోగం పోగొట్టుకొని పనిపాట లేకుండా తిరుగుతూ ఉంటాడు. పక్కా మాస్. అదే టైంలో తన చెల్లి ఫ్రెండ్ ప్రణవి(శ్రీలీల)తో ప్రేమలో పడతాడు. సరిగ్గా అప్పుడే ప్రణవిని తండ్రి(రావు రమేష్).. ప్రముఖ కంపెనీ సీఈఓ ఆనంద్ చక్రవర్తికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తాడు. ఇక అప్పటికే స్వామిని ఇష్టపడిన ప్రణవి.. ఆనంద్ ని కలిసిన తర్వాత షాక్ అవుతుంది. ఈ క్రమంలో అటు స్వామి గురించి, ఇటు ఆనంద్ గురించి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. కట్ చేస్తే.. ఆనంద్ తండ్రి చక్రవర్తి(సచిన్ ఖేడకర్).. విలన్ జేపీ(జయరాం) చేతిలో చిక్కుకుంటాడు. మరి అసలు స్వామి, ఆనంద్ ఎవరు? ప్రణవి ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? విలన్ జేపీ నుండి తండ్రిని ఆనంద్ ఎలా కాపాడుకున్నాడు? చివరికి ఏమైంది? అనేది తెరపై చూడాల్సిందే.
సాధారణంగా మాస్ రాజా రవితేజ ఎనర్జీ ఎలాంటిదో అందరికి తెలిసిందే. మాస్ అయినా యాక్షన్ కామెడీ అయినా చెలరేగిపోతాడు రవితేజ. అయితే.. ‘క్రాక్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుసగా రెండు సీరియస్ సినిమాలు (కిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు) చేసి ప్లాప్స్ వెనకేసుకున్నాడు. దీంతో ఫ్యాన్స్ అంతా మళ్లీ ఓ మాస్ ఎంటర్టైనర్ కావాలని వెయిట్ చేస్తున్న టైంలో ధమాకా చేశాడు. సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే లాంటి సినిమాల తర్వాత డైరెక్టర్ త్రినాథరావు తీసిన సినిమా ఇది. త్రినాథరావుకి రెగ్యులర్ రైటర్ అయిన ప్రసన్న కుమార్ బెజవాడ ఈ ధమాకా మూవీకి స్క్రిప్ట్ అందించారు.
ఇక ధమాకా మూవీ విషయానికి వస్తే.. మాస్ కమర్షియల్ జానర్ లో తెరకెక్కిన రొటీన్ మూవీ. కమర్షియల్ సినిమాలలో రవితేజ ఎనర్జీ మామూలుగా ఉండదు.. ధమాకాలో కూడా ఆయన క్యారెక్టర్ చాలా ఎనర్జిటిక్ గా ఉంది. కానీ.. కథాకథనాల పరంగా సినిమాలో ఏమాత్రం కొత్తదనం కనిపించకపోవడం గమనార్హం. ధమాకా మూవీ.. సినిమాలోని ప్రధాన థీమ్ ని పరిచయం చేస్తూ.. బిజినెస్ మ్యాన్ చక్రవర్తి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ తో మొదలవుతుంది. జనాలకు మంచి చేయాలనుకునే చక్రవర్తి కంపెనీని.. దౌర్జన్యంగా లాక్కొవాలని చూసే విలన్ జేపీ(జయరాం) క్యారెక్టర్ తో పాటు.. మిడిల్ క్లాస్ స్వామి(రవితేజ) క్యారెక్టర్ ని గ్రాండ్ గా పరిచయం చేశాడు దర్శకుడు.
ఆ తర్వాత ప్రణవి క్యారెక్టర్ లో హీరోయిన్ ఎంట్రీ.. ఉద్యోగం కోసం స్వామి తిప్పలు.. మధ్యలో స్వామిని పోలి ఉన్న ఆనంద్ చక్రవర్తి ఎంట్రీ.. లవ్ ట్రాక్. ఇవన్నీ ఓవైపు కంటిన్యూ చేస్తూనే.. మరోవైపు చక్రవర్తి కంపనీ.. జేపీ అరాచకాలు చూపిస్తూ ఇంటర్వెల్ లో ఓ ట్విస్టు ఇచ్చే ప్రయత్నం చేశారు. డ్యూయెల్ రోల్స్ లో రవితేజ క్యారెక్టర్ ఎంటర్టైనింగ్ గానే రాసుకున్నారు. కానీ.. అసలు కథలోకి తీసుకెళ్లడానికి స్క్రీన్ ప్లేని ఇంటర్వెల్ వరకూ సాగదీశారు. సరే ఇంటర్వెల్ ట్విస్టు కూడా ఆడియన్స్ ఊహించిదే జరుగుతుంది.. అదొక మైనస్. అటు స్వామిని, ఇటు ఆనంద్ ని కలిసిన హీరోయిన్ షాకయ్యే ట్విస్టు కూడా కొత్తదేమి కాదు. ఎన్నో కమర్షియల్ యాక్షన్ కామెడీ సినిమాలను మిక్స్ చేసి తీసిన మూవీ ధమాకా.
సెకండాఫ్ లో అసలు కథ కూడా అంత గొప్పగా ప్రెజెంట్ చేయలేకపోయారు మేకర్స్. మరి రాసుకునేటప్పుడు బాగానే అనిపించి ఉండవచ్చు.. కానీ, సినిమాలో కథాకథనాల ఇంపాక్ట్ పెద్దగా లేదనే చెప్పాలి. చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్.. కొత్తగా డిజైన్ చేసిన క్యారెక్టరైజేషన్స్ ఏవి లేవు. సెకండాఫ్ లో ప్రేక్షకులు ఎక్సపెక్ట్ చేసినవే జరుగుతుంటాయి.. ఎందుకో మధ్యమధ్యలో అనవసరమైన సన్నివేశాలు ఇరికించి క్లైమాక్స్ వరకూ సాగదీశారు అనిపిస్తుంది. ఎలాగో కథలో బలమైన కాన్ ఫ్లిక్ట్.. కథను ఇంకా ముందుకు డ్రైవ్ చేసే స్టోరీ పాయింట్.. హైడ్ చేసిన ట్విస్టులు అన్నీ ఫస్టాఫ్ లోనే అయిపోయాయి. దీంతో సెకండాఫ్ అంతా కేవలం కామెడీ ఎంటర్టైన్మెంట్ తో లాగించే ప్రయత్నం చేశారు.
క్లైమాక్స్ కి వచ్చేసరికి రొటీన్.. తన తండ్రి కంపెనీని లాక్కొవాలని చూసిన విలన్ కి బుద్ది చెప్పడం.. అతన్ని క్షమించి వదిలేయడం జరుగుతుంది. అసలు ఈ మూవీకి ధమాకా అని కాకుండా ‘సుడిగాడు 2’ అనేది సరిగ్గా యాప్ట్ అవుతుంది. అలా పెట్టి ఉంటే.. కనీసం ప్రేక్షకులు కొత్త స్టోరీ, స్క్రీన్ ప్లే ఎక్సపెక్ట్ చేసేవారు కాదేమో. ఈ సినిమా మొదలైనప్పటి నుండి లాస్ట్ వరకు పాత సినిమాల రిఫరెన్సులు కనిపిస్తూనే ఉంటాయి. కథలో దమ్ము ఉన్నప్పుడు జనాలు హీరో ఏం చేసినా.. ఒంటి చేత్తో వందమంది రౌడీలను చితక్కొట్టినా యాక్సెప్ట్ చేస్తారు. ఇందులో రవితేజ ఫైట్స్ అన్నీ.. అతని మాస్ ఇమేజ్ ని డామేజ్ చేసేలా ఉండటం మైనస్. ఎందుకంటే.. బాలయ్యకి డిజైన్ చేసినట్లుగా ఇందులో లాజిక్స్ పట్టించుకోకుండా చేశారు. ధమాకా ఓ ఫ్లోలో వెళ్తుంది.. కానీ చివరివరకూ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయింది.
ఈ సినిమాలో స్వామి, ఆనంద్ చక్రవర్తి క్యారెక్టర్స్ కి పూర్తిగా న్యాయం చేశాడు రవితేజ. కానీ.. మాస్ మహారాజా నుండి ఫ్యాన్స్ ఎక్సపెక్ట్ చేసే కొత్తదనం దర్శకరచయితలు రాబట్టలేకపోయారు. శ్రీలీల ప్రణవి పాత్రలో అదరగొట్టినా సరే.. రొమాంటిక్ సీన్స్ లో ఈ పెయిర్ అంతగా వర్కౌట్ కాలేదు. ప్రణవి క్యారెక్టర్ లో శ్రీలీల ఉన్నంతలో బాగా చేసింది. కానీ.. ఆమె క్యారెక్టర్ కి కథలో ప్రాధాన్యత లేకపోవడం మైనస్. బిజినెస్ మ్యాన్ గా సచిన్ ఖేడకర్, విలన్ గా జయరాం మెప్పించారు. ఇందులో చెప్పుకోదగ్గ కామెడీ ఏదైనా ఉందంటే.. అది రావు రమేష్ – హైపర్ ఆదిల ఎపిసోడ్స్. వారిద్దరూ ఉన్నంతలో బాగా నవ్వించారు. మిగతా క్యారెక్టర్స్ కూడా తేలిపోయాయి.
టెక్నికల్ గా ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ.. మ్యూజిక్ గురించి చెప్పుకోవచ్చు. కార్తీక్ ఘట్టమనేని కెమెరా వర్క్.. భీమ్స్ సిసిరిలియో సాంగ్స్ బాగున్నాయి. స్క్రిప్ట్ పరంగా ధమాకా మూవీకి సరైన న్యాయం జరగలేదు అనిపిస్తుంది. ఎందుకంటే.. పాత సినిమాలన్నీ మిక్స్ చేసి ఒక్కటిగా తీశారు. అందులోనూ కథా కథనాలలో ఎక్కడకూడా కొత్తదనం లేకపోగా.. ట్విస్టులు కూడా ప్రెడక్టబుల్ గా ఉండటం బిగ్ మైనస్. సినిమా చూపిస్త మావ, నేను లోకల్ స్థాయిలో ప్రసన్న కుమార్ రైటింగ్ మ్యాజిక్ ధమాకాలో కనిపించలేదు. డైరెక్టర్ త్రినాథరావు.. ప్రమోషన్స్ లో చెప్పిన ఇంపాక్ట్.. థియేటర్స్ లో సీట్లు ఎగరటాలు ఏమి జరగలేదు.. సినిమాలో అంత ఎగిరిపడే బలమైన సన్నివేశాలు లేవనేది ఆడియన్స్ అభిప్రాయం. క్లైమాక్స్ లో ఓ కొత్త సాంగ్ పెట్టారు. అదొక్కటి సర్ప్రైజ్.. బట్ అదికూడా కొత్తేమి కాదు.