సినిమాలు- తెలుగు ప్రేక్షకులు.. ఎప్పటికీ విడదీయలేని ఎమోషన్. ప్రతివారం కూడా మన ముందుకు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అందులో కొన్ని ఎంటర్ టైన్ చేస్తుంటాయి. మరికొన్ని మన జీవితంలోని కొన్ని విషయాల్ని గుర్తుచేస్తుంటాయి. మనం ఏం చేస్తున్నాం.. ఎలా ప్రవర్తిస్తున్నాం లాంటి వాటిని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంటాయి. అలాంటి సినిమాలు ఒకప్పుడు థియేటర్స్ లో వచ్చేవి. కరోనా తర్వాత ఓటీటీ వినియోగం బాగా పెరిగిపోవడంతో.. నేరుగా మొబైల్స్ లో మనల్ని పలకరిస్తున్నాయి. అలా బుధవారం(అక్టోబరు 19) రిలీజైన చిత్రం ‘అమ్ము’. మరి ఇది ఎలా ఉంది? అనే విషయం రివ్యూలో చూద్దాం.
కథ:
అమ్ము(ఐశ్వర్యలక్ష్మి) ఓ నార్మల్ అమ్మాయి. చిన్నప్పటి నుంచి తెలిసిన, పక్కింట్లో ఉండే రవీంద్రనాథ్(నవీన్ చంద్ర)ని పెళ్లి చేసుకుంటుంది. సీఐగా ఉద్యోగం చేస్తున్న రవీంద్రతో.. అమ్ము కొత్త జీవితం మొదలుపెడుతుంది. పెళ్లయిన కొన్నిరోజుల వరకు బాగానే చూసుకున్న రవీంద్ర.. ఆ తర్వాత శాడిస్ట్ లా ప్రవర్తిస్తాడు. ఇంట్లో అమ్ముని బాధపెట్టడం, కొట్టడం లాంటివి చేసి పైశాచికంగా ప్రవర్తించే రవీంద్ర.. బయటమాత్రం మంచివాడిలా నటిస్తుంటాడు. రోజురోజుకీ రవీంద్ర ప్రవర్తన హద్దుమీరుతున్నా సరే.. అమ్ము అన్నింటినీ భర్తిసూనే ఉంటుంది. చివరకు ఓ రోజు డీజీపీకి కంప్లైంట్ ఇవ్వాలని ఫిక్స్ అవుతుంది. అదే టైంలో అమ్ము-రవీంద్ర లైఫ్ లోకి ప్రభుదాస్ అనే ఖైదీ ఎంటరవుతాడు. ఇంతకీ ఇతడెవరు? అమ్ముతో మనోడికి ఏంటి సంబంధం? చివరకు ఏం జరిగింది? తెలియాలంటే మీరు ‘అమ్ము’ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
‘మొగుడు అన్నాక కొడతాడు.. భార్య భరించాలి, సర్దుకుపోవాలి’.. ఇది తరతరాల నుంచి సమాజంలో నాటుకుపోయిన ఓ భావన. ‘అమ్ము’ సినిమా చూస్తున్నంతసేపు కూడా ఇదే మనకి గుర్తొస్తుంది. మన ఇళ్లలో జరిగే సంఘటనలే సినిమాగా తీశారా అనిపిస్తుంది. ఎందుకంటే టైంకి భోజనం పెట్టలేదని, కూరలో ఉప్పు సరిపోలేదని భార్యని కొట్టిన భర్త లాంటివి రోజూ మనం నిత్య జీవితంలో, వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ‘అమ్ము’ దర్శకుడు కూడా.. ఇలాంటి ఇన్సిడెంట్స్ ని స్ఫూర్తిగా తీసుకునే సీన్స్ రాసుకున్నాడు. ‘గృహ హింస’ బ్యాక్ డ్రాప్ లో తెలుగు సినిమాల్లో కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయి తప్పించి.. పూర్తిస్థాయిలో అలాంటి సినిమా ఇప్పటికి వరకు రాలేదు. హిందీలో ‘తప్పడ్’, ‘డార్లింగ్స్’ చిత్రాలు ఈ తరహావే. ఇక ‘అమ్ము’లో గృహహింస అనే పాయింట్ కంటే బలమైన సంఘర్షణ ఉంది. అది మనల్ని చివరి వరకు సినిమా చూసేలా చేస్తుంది. కాకపోతే సెకండాఫ్ లో వచ్చే సీన్స్ కొన్ని లాజిక్ కి దూరంగా ఉంటాయి.
ఇక నటీనటుల విషయానికొస్తే.. ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఐశ్వర్య లక్ష్మి గురించి. ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అమ్మాయిగా, ఇల్లాలిగా అద్భుతంగా నటించింది. కొన్ని కొన్ని సీన్స్ లో ఆమె ఏడుస్తుంటే మనకు కూడా ఏడుపొచ్చేస్తుంది. ఇక భర్త తనపై చేయి చేసుకున్నప్పుడు సహించలేకపోవడం, నిస్సహాయతని చూపించడం లాంటి సీన్స్ లో అదరగొట్టేసింది. ఇక రవీంద్రగా నటించిన నవీన్ చంద్ర కూడా డిఫరెంట్ షేడ్స్ లో యాక్ట్ చేసి ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్ లో నవీన్ చంద్ర యాక్టింగ్ మనోడి సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. ఇక మిగిలిన వారిలో బాబీ సింహా, ప్రేమ్ సాగర్, సంజయ్ స్వరూప్ తదితరులు పరిధి మేరకు నటించారు. రఘుబాబు రెండే సీన్స్ లో కనిపించినా.. కథలో కీలక పాత్ర చేశారు.
ఇక టెక్నికల్ విషయానికొస్తే.. ‘అమ్ము’ సినిమాలో ఇల్లు, పోలీస్ స్టేషన్ తప్పించి పెద్దగా లోకేషన్స్ ఏం లేవు. అయినా సరే ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాటోగ్రాఫర్ అపూర్వ అనిల్ శాలిగ్రాం మ్యాజిక్ చేశారు. మనల్ని సినిమాలో లీనమయ్యేలా చేశారు. భరత్ శంకర్ అందించిన సంగీతం కూడా సేమ్ అలానే అనిపించింది. ఉన్న చిన్న చిన్న లోపాల్ని కూడా యాక్టర్స్… తమ ఫెర్ఫామెన్స్ తో కవర్ చేసేశారు. పద్మావతి రాసిన.. ‘ఒక మగాడు పెళ్లాం మీద చెయ్యి ఎత్తకూడదు. అలా ఎత్తాడే అనుకో.. వాడితో ఒక్క క్షణం కూడా పెళ్లాం ఉండాల్సిన అవసరం లేదు’ అనే డైలాగ్ ఆలోచింపజేసింది. ఇక ఫైనల్ గా దర్శకుడు చారుకేశ్ శేఖర్.. ఓటీటీ కావాల్సిన మూవీ తీశాడు. ఈ వీకెండ్ ఓ మంచి సినిమా చూద్దామని అనుకుంటే మాత్రం.. ‘అమెజాన్ ప్రైమ్’లో స్ట్రీమింగ్ అవుతున్న ‘అమ్ము’ ట్రై చేయండి. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే.. మహిళలు, పెళ్లికి రెడీ అయిన అమ్మాయిలు ధైర్యంగా ఉండాలని చెప్పే సినిమా ఇదే. అలా అని హీరోయిన్ పాత్ర కొత్తదేం కాదు. ప్రతి ఇంట్లో, ఊరిలో ఓ అమ్ము ఉంటుంది. మనసులో తనకు తానుగా కంచె నుంచి బయటకు రావాలని, భయం వదిలేయాలని చెప్పే చిత్రమిది.
ప్లస్ లు:
మైనస్ లు:
చివరిమాట: మన చుట్టూ ఉండే ఓ అమ్మాయి కథ ‘అమ్ము’!
(గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)