3 రాజధానులపై భవిష్యత్‌ ప్రణాళిక ప్రకటించిన సీఎం జగన్‌

3capitals jagan

మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. దేశవ్యాప్తంగా సంచలనమయ్యింది. వికేంద్రీకరణ బిల్లు, CRDA రద్దు బిల్లులను మంత్రివర్గం రద్దు చేసినట్లు ఏపీ అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలిపారు. శుక్రవారంలోపు మెమో దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రకటన చేశారు. ఏపీ రాజధాని విషంలో మాత్రం పూర్తి స్పష్టత రాలేదు. ఇప్పటికిప్పుడు కొత్త బిల్లును అయితే ప్రవేశ పెట్టడం లేదు. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై సీఎం జగన్‌ అసెంబ్లీలో మాట్లాడారు. పూర్తిస్థాయి వికేంద్రీకరణ బిల్లుతో వస్తామంటూ జగన్‌ ప్రకటించారు.

 ‘ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉండేది. హైకోర్టు గుంటూరులో ఉండేది. 1956లో రాజధాని, హైకోర్టు రెండింటిని హైదరాబాద్‌ పట్టుకుపోయారు. అమరావతి ప్రాంతం అంటే నాకు వ్యతిరేకత లేదు. నా ఇల్లు కూడా ఇక్కడే ఉంది. నాకు ఈ ప్రాంతం అంటే ప్రేమ ఉంది. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఇప్పటి లెక్కల ప్రకారం రూ.లక్ష కోట్లు అవుతుందని చెప్పారు. అదే ఇంకో పదేళ్ల తర్వాత ఆ లెక్కలు ఆరేడు రెట్లు పెరుగుతాయి. సరైన మౌలిక వసతులు లేకుండా రాజధానిని ఎలా ఊహించుకుంటారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్‌, బెంగళూరు, చైన్నై వంటి నగరాలకు వెళ్లాల్సిందేనా? విశాఖ ఏపీలో పెద్ద నగరం. అక్కడ అన్ని వసతులు, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. వాటికి కాస్త పైమెరుగులు దిద్దితే సరిపోతుంది. ఇంకో ఐదేళ్లలో హైదరాబాద్‌తో విశాఖ పోటీ పడగలదు’ అంటూ సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు.

సమగ్రమైన బిల్లు తీసుకొస్తాం..

పరిపాలన వికేంద్రీకరణ బిల్లు విషయంలో అనేక దుష్ప్రచారాలు జరిగినట్లు జగన్‌ అభిప్రాయపడ్డారు. వికేంద్రీకరణ అవసరం, ప్రభుత్వం సదుద్దేశాన్ని బిల్లులోనే ప్రస్తావిస్తామని సీఎం తెలిపారు. చట్ట, న్యాయపరంగా అన్ని సమాధానాలను బిల్లులోనే పొందు పరిచేందుకు, బిల్లును మరింత విస్తృత పరిచేందుకు బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. పూర్తి సమగ్రమైన బిల్లుతో వస్తామంటూ సీఎం జగన్‌ ప్రకటించారు. మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం సరైందేనా? మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.