నర్సాపురం ఎంపీ శ్రీరెడ్డి ట్రాప్ లో పడ్డారా? అరెస్ట్ వెనుక ఏమి జరిగింది?

sri reddyకొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నిత్యం వినిపిస్తూ వచ్చిన పేరు రఘురామ కృష్ణరాజు. పేరుకి ఈయన వైసీపీ ఎంపీనే అయినా.. ఈయన జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయని రోజు లేదు. ఇందుకు తగ్గట్టే.. వైసీపీ నేతలు కూడా ఎంపీపై ఎదురుదాడి చేస్తూ వచ్చారు. కానీ.., రఘురామ గత కొన్ని రోజుల క్రితం వరకు ఎవ్వరిని వ్యక్తిగతంగా దూషించిన సందర్భాలు లేవు. కానీ.., గత వారం రోజుల్లోనే ఆయన విమర్శలు కొంత మేర హద్దులు దాటాయి. నాయకులపై వ్యక్తిగత దూషణలు చేసే స్థాయికి వెళ్లాయి. కానీ.., ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి. ఏడాది కాలంగా సంబంధిత అంశాల మీదే విమర్శలు చేస్తూ వచ్చిన రఘురామ కృష్ణరాజు ఇప్పుడు ఒక్కసారిగా ఆ హద్దు ఎలా దాటారు? ఆయన ఆ విధంగా ప్రేపించబడ్డారా? ఆయనకి తెలియకుండానే ఆయన ఓ పద్మవ్యూహంలో చిక్కుకున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రఘురామ కృష్ణరాజు ఏరోజు కూడా సినిమా ఇండస్ట్రీ పై అనుచిత కామెంట్స్ చేసింది లేదు. కానీ.., ఒక్కసారిగా ఆయనపై శ్రీరెడ్డి ఘాటైన విమర్శలతో విరుచుకుపడింది. ఇక్కడ ఆమె చాలా దారుణమైన కామెంట్స్ చేసింది. రఘురామ కృష్ణరాజుని మాత్రమే కాకుండా.., వారి ఇంట్లో వాళ్ళని కూడా దుర్భాషలాడింది. నిజానికి.. శ్రీరెడ్డి వైసీపీ నాయకురాలు కాదు. ఆమెకి రాజకీయాలకి సంభంధం లేదు. ఒకవేళ ఆమె జగన్ అభిమాని అయినా.., ఈ స్థాయిలో ఒక ఎంపీని తిట్టే సాహసం చేయదు. దీంతో.. ఇది వ్యూహాత్మకంగా జరిగిన శిఖండి దాడి అన్న అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి.

కానీ.., ఇక్కడే రఘురామ కృష్ణరాజు విచక్షణ, సహనం కోల్పోయారు. తన మీదకి ఒక శృంగార తారని ఉసి గొల్పారు అంటూ వైసీపీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ప్రారంభించాడు. జగన్ పై, సజ్జల రామకృష్ణపై, ఒక సామజిక వర్గం కాస్త కఠినమైన మాటలను ఉపయోగిస్తూ కామెంట్స్ చేశాడు. అలా.. రఘురామ కృష్ణరాజు శ్రీరెడ్డి ట్రాప్ లో పడిపోయాడు. ఇక్కడ శ్రీరెడ్డి వెనుక ఎవరున్నారు అన్నది ప్రశ్న కాదు. ఆమె రెచ్చకొడితే.., రాజుగారు ఆ ట్రాప్ లో పడటమే ఆయన చేసిన తప్పు. సరిగ్గా.. ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న ఏపీ ప్రభుత్వం రఘురామ కృష్ణరాజుపై సీఐడీ అస్త్రాన్ని ప్రయోగించింది. పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి.., ఇప్పుడు విచారణ కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే.. ఈ మొత్తం వ్యవహారంలో రఘురామ కృష్ణరాజుని ఏ-1 గా చేర్చిన సీఐడీ.. టీవీ5 ఛానెల్ ని ఏ-2 గా, ఏబీఎన్ ని ఏ-3 గా చేర్చింది. ఎంపీ రఘురామ కృష్ణరాజుకి ప్రత్యేకంగా స్లాట్స్ ఏర్పాటు చేసి.. ఆయనకి కవరేజ్ ఇవ్వడమే ఆ ఛానెల్స్ తప్పట. అయితే.., ఇప్పటి వరకు ఆయా ఛానెల్స్ యాజమాన్యానికి సీఐడీ నుండి ఎలాంటి నోటీసులు అందకపోవడం గమనార్హం. మరి రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచేసిన ఈ వ్యవహారం రానున్న కాలంలో ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.