రైతులకు శుభవార్త, ఒక్కొక్కరి అకౌంట్ లో 7,500

అమరావతి- కరోనా ప్రపంచంలో అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. చాలా దేశాలు కరోనా దెబ్బకి ఆర్ధికంగా చితికిపోయాయి. ఐతే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కరోనా లాంటి క్లిష్ట సమయంలోను ప్రజా సంక్షేమాన్ని విస్మరించడం లేదు. ఎప్పటికప్పుడు ప్రజా సంక్షేమ పధకాలను ప్రవేశపెడుతూ ఏపీ సీఎం జగన్ ప్రజాభిమానాన్ని పొందుతున్నారు. ప్రస్తుతం కరోనా కష్టకాలంలోనూ అన్నదాత‌లకు జగన్ ప్రభుత్వం తీపుి కబురు చెప్పింది. ఖ‌రీఫ్ పంట‌ కాలానికి సంబంధించి వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను తొలి విడత సాయాన్ని అందిస్తోంది. ఈమేరకు గురువారం అంటే మే 13న రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ లాంచనంగా రైతు ఖాతాల్లోకి డబ్బులు జమచేయనున్నారు. ఒక్కో రైతు ఖాతాకు 7,500 రూపాయలు జమకానున్నాయి. తొలి విడతగా 52 లక్షల 38 వేల రైతుల ఖాతాల్లో 3 వేల 882 కోట్లు జమ చేయనున్నారు.

రైతు బంధు, పీఎం కిసాన్ పధకానికి సంబంధించి అర్హులైన రైతుల జాబితాలను ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాల వద్ద ఉంచారు. 2019- 20 సంవత్సరం నుంచి జగన్ ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ లో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం, కేంద్ర సర్కారు ఉమ్మడిగా తొలి విడత మేలో 7,500, రెండో విడత అక్టోబర్‌లో 4 వేలు, మూడో విడత జనవరిలో 2 వేల చొప్పున అన్నదాత‌ల‌ ఖాతాల్లో జమ చేసేందుకు షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ఇక ఈ పథకం ద్వారా ఒక్కో రైతు ప్రతి ఏడాది 13 వేల 500 రూపాయలు లబ్ధి పొందనున్నాడు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 7,500 ఇస్తుండగా, కేంద్ర ప్రభుత్వం 6 వేలు అందిస్తోంది. రాష్ట్రంలో గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది అద‌నంగా మ‌రికొంత‌మంది రైతులకు ప్రయోజనం కలగనుందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు రైతు భరోసా కింద జగన్ సర్కార్ 13 వేల 101 కోట్లు ఖర్చు చేసిందని తెలుస్తోంది. గురువారం విడుదల చేసే నిధులతో కలిపి ఈ మొత్తం 16 వేల 983 కోట్ల రూపాయలకు చేరనుందని అధికారులు చెప్పారు.