ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి యువతిపై 400 మంది అత్యాచారం

మహారాష్ట్ర- దేశంలో నేరాలను అదుపు చేయడానికి ప్రభుత్వం ఎన్నో కఠినమైన చట్టాలను తెచ్చింది. అయినప్పటికీ క్రైం రేట్ మాత్రం తగ్గడం లేదు. దేశంలో ఎక్కడొ ఓ చోట హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఇదిగో ఇటువంటి సమయంలో మహారాష్ట్రలో జరిగిన అమానుష ఘటన సంచలనం రేపుతోంది. అభం శుభం తెలియని ఓ యువతిపై ఏకంగా 400 మంది లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆరు నెలలుగా ఆమెపై ఏకంగా 400 మంది అత్యాచారానికి ఒడిగట్టడంతో ఆ యువతి గర్భం దాల్చింది. నిందితుల్లో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నాడు. న్యూస్‌ 18 లోక్‌ మాత్‌ కథనం ప్రకారం బీడ్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతి తల్లి రెండేళ్ల క్రితం చనిపోయింది.

rape 0 1

ఆ తరువాత కొన్నాళ్లకు తండ్రి ఆమెను ఓ వ్యక్తికిచ్చి పెళ్లి చేశాడు. ఐతే తన సొంత మామ (భర్త తండ్రి) లైంగికంగా వేధిస్తుండటంతో భరించలేని ఆ యువతి ఏడాది తర్వాత పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. ఆరు నెలల క్రితం ఏదైనా ఉద్యోగం చేసుకుందామని అంబేజోగై పట్టణానికి వెళ్లిందా యువతి. అక్కడ ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పిన ఇద్దరు వ్యక్తులు ఆమెను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెపై ఆ తరువాత చాలా మంది లైంగిక దాడికి పాల్పడ్డారు.

ప్రస్తుతం రెండు నెలల గర్భవతిగా ఉన్న యువతి పోలీసులను ఆశ్రయించి జరిగిన దారుణం చెప్పుకుంది. తనపై ఆరు నెలలుగా సుమారు 400 మందికి అత్యాచారానికి పాల్పడ్డారని, అందులో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నాడని చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు నలుగురిని ఆరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు.