స్కీమ్ ల పేరుతో స్కామ్.. 2 కోట్లు కొట్టేసిన కిలాడీ లేడీ

హైదరాబాద్- ఈ మధ్య కాలంలో మోసాలు బాగా పెరిగిపోయాయి. దీంతో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెయిసడం లేదు. పైగా కొందరు కిలాడీ లేడీలు సైతం మోసాలకు పాల్పడుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో స్కీమ్ ల పేరుతో స్కామ్ చేసిన ఓ కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన పీర్జాదిగూడలోని రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన 32 ఏళ్ల కంకుల పల్లవి రెడ్డి శ్రీ సాయి నిత్య ట్రేడర్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో 2019 లో ఏఎస్ రావునగర్ ​లో బైక్ షోరూం తెరిచింది.

ఆ తరువాత గత సంవత్సరం దమ్మాయిగూడలోని దోమడుగు గ్రామంలో మరో బైక్ షోరూమ్ ను ప్రారంభించింది. ఈ క్రమంలో స్కీమ్ ​ల పేరుతో కస్టమర్లను మోసం చేసేందుకు ప్లాన్ వేసింది పల్లవి. మొత్తం మూడు స్కీమ్ లను ప్రవేశపెట్టింది. మొదటి స్కీమ్ లో భాగంగా బైక్ కొనే వారు దాని రేటులో 60 శాతం డబ్బు కడితే 40 శాతం డిస్కౌంట్ ​ఇస్తామని చెప్పింది. ఇంకేముంది ఆమె మాటలు నమ్మిన కస్టమర్లు చాలా మంది 60 శాతం డబ్బు కట్టారు. తన మాస్టర్ ప్లాన్ లో భాగంగా 20 శాతం డబ్బును కస్టమర్ పేరుపై బ్యాంక్ నుంచి లోన్ తీసి ఆ డబ్బును తన అకౌంట్​లో వేసుకుని 12 ఈఎంఐలు తానే కడతానని చెప్పింది పల్లవి.

Pallavi 1

ఫైనాన్స్ వచ్చిన తర్వాత బైక్ డెలివరీ ఉంటుందని నమ్మబలికింది. 60 శాతం డబ్బు కట్టిన కస్టమర్, మరో నలుగురిని ఈ స్కీమ్ లో చేర్పిస్తేనే డిస్కౌంట్ వర్తిస్తుందని మరో స్కీమ్ కు తెరతీసింది. ఇక రెండో స్కీమ్​ లో భాగంగా బైక్ రేటులో 50 శాతం చెల్లించిన కస్టమర్​కు 100 రోజుల తర్వాత డెలివరీ ఉంటుందని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసింది. మూడో స్కీమ్​ లో భాగంగా ఎవరైతే కస్టమర్లు డబ్బులు పెట్టుబడిగా పెడతారో 100 రోజుల తర్వాత వారికి రెట్టింపు డబ్బులు ఇస్తానని నమ్మించింది

కిలాడీ లేడీ పల్లవి రెడ్డి చెప్పిన ఈ మూడు స్కీమ్​ లలో దాదాపు 300 మంది చేరి డబ్బులు కట్టారు. భారీగా డబ్బులు వసూలు చేశాక పల్లవి రెడ్డి రెండు బైక్ షోరూమ్ ​లను మూసేసి ఎంచక్కా చెక్కేసింది. పల్లవి రెడ్డి స్కీమ్స్​ లో చేరి మోసోయినట్లు ఈ నెల 11న మౌలాలికి చెందిన మహేశ్వరి అనే మహిళ పోలీసులకు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన జవహర్ నగర్ పోలీసులు పల్లవి రెడ్డితో పాటు, ఆమెకు సహకరించిన సంజయ్ ​ను గురువారం అరెస్ట్ చేశారు. సుమారు రెండు కోట్ల రూపాయలు పల్లవి రెడ్డి కస్చమర్ల నుంచి వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.