ప్రేమికుల మెడలో టైర్లు, అందరి ముందు బలవంతంగా డ్యాన్స్-వీడియో వైరల్

మధ్యప్రదేశ్- ఈ డిజిటల్ యుగంలో కూడా ఇంకా చాలా మంది వివక్షకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రేమిచుకున్న వారు ఇప్పటికీ కుల, వర్గ కట్టుబాట్ల మధ్య నలిగిపోతున్నారు. అందుకే చాలా మంది ప్రేమికులు పారిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. కొన్న సందర్బాల్లో ప్రేమించి, పెళ్లి చేసుకుని, చాలా కాలం తరువాత తిరిగి వచ్చాక కూడా వారిపై దాడులు జరుగుతున్నాయి.

తాజాగా ఇద్దరు ప్రేమికులపై గ్రామస్థులు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. మేజర్లైన ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. అబ్బాయికి 21 ఏళ్లు కాగా, అమ్మాయికి 19 ఏళ్లు. గత జూలైలో ఇద్దరూ తమ ఇళ్లలోంచీ పారిపోయి, పెళ్లి చేసుకుని గుజరాత్‌లో కొంత కాలం ఉన్నారు. ఇక తమ కుటుంబాల్లో కోపం చల్లారి ఉంటుందన్న ఉద్దేశ్యంతో సొంత ఉరుకు వచ్చారు. మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలోని కుండి గ్రామానికి తిరిగి వచ్చిన ప్రేమికులను అవమానం తప్పలేదు.

mamatha 2

స్వగ్రామం వచ్చిన ఆ ప్రేమికులకి ఘోరమైన పరిస్థితి ఎదురైంది. గ్రామానికి చెందిన కొంత మంది యువకులు ఆ ప్రేమికుల మెడలో బైక్ టైర్లు వేసి అందరి ముందూ బలవంతంగా డ్యాన్స్ చేయించారు. అంతే కాదు ఒకానొక సందర్బంలో కర్రతో వారిపై దాడి కూడా చేశారు. ఇక వాళ్లిద్దరు ఇంటి నుంచీ పారిపోవడానికి సహకరించిందన్న కారణంతో మరో 13 ఏళ్ల మైనర్ బాలిక మెడలో సైతం టైర్ వేసి డ్యాన్స్ చేయించారు.

ఈ ఘటనకు సంబందించి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఈ విషయం స్థానిక పోలీసుల వరకు వెళ్లడంతో సీరియస్ అయ్యింది. దీంతో మొత్తం అయిదుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతే కాదు ఇప్పటికే ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ కూడా చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రేమికులకు గ్రామంలో రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు పోలీసులు.