నమామి గోవింద బ్రాండ్.. టీటీడీ భక్తుల కోసం ప్రత్యేత ఉత్పత్తులు

తిరుపతి- తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం సరికొత్త ప్రడక్ట్స్ ను మార్కెట్ లోకి విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసింది. నమామి గోవింద బ్రాండ్ పేరుతో పది రోజుల్లో పంచగవ్య ఉత్పత్తులను భక్తులకు అందుబాటులో తీసుకొస్తున్నట్లు టీటీడీ ఈఓ కేఎస్ జవహర్ రెడ్డి చెప్పారు.

తిరుపతిలోని డీపీడబ్ల్యూ స్టోర్‌ లో పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఆయన బుధవారం సందర్శించారు. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గోమాత ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేందుకు పంచగవ్యాలతో పలు రకాల గృహావసర ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు ఈ సందర్బంగా టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి తెలిపారు.

కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మసి సాంకేతిక సహకారంతో మొత్తం 15 రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ప్రడక్ట్స్ కు సంబందించిన పనులు ఆఖరి దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే ఈ ఉత్పత్తులు భక్తులకు అందుబాటిలోకి వస్తాయని జవహర్ రెడ్డి తెలిపారు.

అగరబత్తీ, హెర్బల్ షాంపు, హెర్బల్ టూత్ పౌడర్, హెర్బల్ సోప్, ధూప్ చూర్ణం, విభూది, నాజిల్ డ్రాప్స్, హెర్బల్ ఫేస్ ప్యాక్, ధూప్ చూర్ణం, హెర్బల్ ఫ్లోర్ క్లీనర్, ధూప్ చూర్ణం సాంబ్రాణి కప్, ధూప్ కోన్, ధూప్ స్టిక్స్, గో అర్కం, పిడకలు, కౌడంగ్ లాగ్ ప్రడక్ట్స్ నమామి గోవింద బ్రాండ్ లో ఉన్నాయని ఈఓ చెప్పారు. పంచభూతాల సాక్షిగా ఐదు హోమ గుండాల్లో ఎంతో పవిత్రంగా విభూది తయారు చేస్తున్నామని తెలిపారు. అగరబత్తీల తరహాలోనే ఈ ఉత్పత్తులను కూడా భక్తులు ఆదరించాలని జవహర్ రెడ్డి శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి చేశారు.